కోల్‌కతా: మోసపూరిత జీఎస్టీ ఇన్వాయిస్లకు (GST Fraud) సంబంధించిన వ్యవహారంలో పశ్చిమబెంగాల్, జార్ఖండ్‌లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాడులు (ED Raids) నిర్వహిస్తున్నది. కోల్‌కతా, రాంచీ, జంషెడ్పూర్ సహా తొమ్మిది ప్రాంతాల్లో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. కోల్‌కతా కేంద్రంగా వ్యాపారాలు నిర్వహిస్తున్న శివకుమార్ దేవర, సుమిత్ గుప్తా, అమిత్ గుప్తా అనే ముగ్గురులు సుమారు రూ.14,325 కోట్లకు సంబధించి నకిలీ ఇన్వాయిస్లు సృష్టించారని, దీంతో రూ.800 కోట్లకుపైగా అనర్హమైన ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ క్లెయిమ్‌లు వచ్చాయనే ఆరోపణలు ఉన్నాయి. తద్వారా మనీలాండరింగ్‌కు పాల్పడ్డారని కేసు నమోదుచేసిన ఈడీ దర్యాప్తు చేస్తున్నది.
ఈ నేపథ్యంలో జీఎస్టీ మోసానికి సంబంధించిన పత్రాలు, ఆస్తులు వెలికితీయడమే లక్ష్యంగా ఈడీ దాడులు నిర్వహిస్తున్నది. చట్టవ్యతిరేకంగా ట్యాక్స్ బెనిఫిట్స్ పొందడానికి నకిలీ సేల్స్ రికార్డులను ఉపయోగించారని అధికారులు అనుమానిస్తున్నారు. కాగా, జీఎస్టీ ఫ్రాడ్ కేసుల్లో గతేడాది జీఎస్టీ ఇంటెలిజెన్స్ వింగ్ అధికారులు దేవర, అమిత్ గుప్తాలను అరెస్టు చేశారు.