రాయ్‌పూర్: ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు సోమవారం ఛత్తీస్‌గఢ్ మాజీ సీఎం, కాంగ్రెస్ నేత భూపేశ్ బఘేల్ నివాసంలో సోదాలు నిర్వహించారు. ఆయన కుమారుడు చైతన్య బఘేల్ మద్యం కుంభకోణంలో మనీలాండరింగ్‌కు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయని అధికారులు చెప్పారు. భిలాయ్‌లోని ఇంట్లో చైతన్య బఘేల్, భూపేశ్ బఘేల్ కలిసి ఉంటున్నారు.
ఈ కుంభకోణంలో రూ.2,100 కోట్లకు పైగా చేతులు మారినట్లు ఈడీ ఆరోపించింది. కాగా తమపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేశారని ఈడీ అధికారులు ఆరోపించారు. అధికారులను చుట్టుముట్టి కొడుతున్నట్లు కొన్ని వీడియోల్లో కనిపించింది.
ఈడీ అధికారులకు తన ఇంట్లో రూ.32-33 లక్షలు దొరకటం పెద్ద విషయం కాదని భూపేశ్ బఘేల్ అన్నారు. బీజేపీ నిరాశలో కూరుకుపోయినందునే తనపై ఈడీ దాడులకు దిగిందని అన్నారు. సోమవారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ, ‘మాది చాలా పెద్ద కుటుంబం. 140 ఎకరాల్లో వ్యవసాయం చేస్తున్నాం. ఇతర ఆదాయ వనరులు కూడా ఉన్నాయి’ అని అన్నారు. ఇంత పెద్ద కుటుంబాన్ని కలిగిన తన ఇంట్లో ఈడీ రూ.33 లక్షల్ని గుర్తించటం పెద్ద విషయం కాదని పేర్కొన్నారు.