న్యూఢిల్లీ: గోవా నైట్‌క్లబ్(Goa Nightclub)లో జరిగిన అగ్నిప్రమాదంలో 25 మంది మృతిచెందిన విషయం తెలిసిందే. ఆ కేసులో ఇప్పటికే ఆ క్లబ్ ఓనర్లు గౌరవ్, సౌరభ్ లూత్రాలను అరెస్టు చేశారు. అయితే తాజాగా ఇవాళ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోదాలు చేపట్టింది. ఢిల్లీ, గోవాలో ఉన్న ఆ ఇద్దరికి చెందిన ప్రాపర్టీలపై తనిఖీలు జరుగుతున్నాయి. ఢిల్లీలోని అయిదు ప్రదేశాలతో పాటు గోవాలోని మూడు చోట్ల ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు. అగ్నిప్రమాదానికి గురైన రోమియో లేన్ క్లబ్ ఓనర్లు ఆ ఇద్దరే.
గత ఏడాది డిసెంబర్ ఆరో తేదీన ఆ ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ప్రమాదం జరిగిన కొన్ని గంటల్లోనే లుత్రా సోదరులు థాయ్‌ల్యాండ్ పరారీ అయ్యారు. బ్యాంకాక్ నుంచి వాళ్లను డిపోర్ట్ చేశారు. ఆ తర్వాత డిసెంబర్ 17వ తేదీన ఢిల్లీ ఎయిర్‌పోర్టులోని ఇమ్మిగ్రేషన్ కౌంటర్లో గోవా పోలీసులు వాళ్లను అదుపులోకి తీసుకున్నారు. ఆ ఇద్దరి భారతీయ పాస్‌పోర్టులను రద్దు చేశారు. ఎమర్జెన్సీ సర్టిఫికేట్ల ఆధారంగా డిపోర్ట్ చేశారు.