న్యూఢిల్లీ: నేషనల్ హెరాల్డ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఇతరులు రూ. 988 కోట్ల మనీ లాండరింగ్‌కు పాల్పడ్డారని ఆరోపిస్తూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) చార్జిషీట్ దాఖలు చేసింది. ఏప్రిల్ 9న దాఖలైన ఈ చార్జిషీట్లోని నేరాభియోగాలను పరిశీలించిన ప్రత్యేక న్యాయమూర్తి విశాల్ గోగ్నె తదుపరి విచారణ ప్రక్రియను ఏప్రిల్ 25వ తేదీకి వాయిదా వేశారు. కాంగ్రెస్ నాయకుడు శామ్ పిట్రోడా, సుమన్ దూబేను కూడా చార్జిషీట్లో నిందితులుగా ఈడీ పేర్కొంది.
బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి 2014 జూన్ 26న దాఖలుచేసిన పైవేట్ ఫిర్యాదును ఢిల్లీ కోర్టు పరిగణనలోకి తీసుకున్న తర్వాత 2021లో ఈడీ దర్యాప్తు ప్రారంభమైంది. అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్(ఏజేఎల్)కు చెందిన రూ. 2వేల కోట్ల విలువైన ఆస్తులను సోనియా, రాహుల్ యజమానులుగా ఉన్న యంగ్ ఇండియన్ ప్రైవేట్ కంపెనీ కేవలం రూ. 50 లక్షలకు దక్కించుకున్నట్టు ఈడీ చార్జిషీట్లో పేర్కొంది. సోనియా, రాహుల్‌పై ఈడీ చార్జిషీట్ నేపథ్యంలో బీజేపీ స్పందించింది. అవినీతి, ప్రజాధనం లూటీకి పాల్పడిన వారు ఇప్పుడు తిరిగి చెల్లించక తప్పదని పేర్కొన్నది.
ఏజేఎల్‌కు చెందిన రూ. 2,000 కోట్లను స్వాహా చేయడానికి కాంగ్రెస్ నాయకులు నేరపూరిత కుట్రకు పాల్పడ్డారని, సోనియా, రాహుల్‌కి మెజారిటీ షేర్లు ఉన్న యంగ్ ఇండియన్‌కు కేవలం 50 లక్షలకు ఏజేఎల్‌కు చెందిన 99 శాతం షేర్లను బదిలీ చేసుకున్నారని చార్జిషీట్లో ఈడీ ఆరోపించింది. ఈడీ తన చార్జిషీట్లో సోనియాని ఏ-1గా, రాహుల్ గాంధీని ఏ-2గా పేర్కొన్నట్టు తెలుస్తోంది. పీఎంఎల్ఏలోని సెక్షన్ 4 కింద నిందితులను శిక్షించాలని ఈడీ కోరింది. ఈ సెక్షన్ కింద నేరం రుజువైతే ఏడేళ్ల జైలు శిక్ష పడుతుంది.