uddhav| న్యూఢిల్లీ: బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏలో మూడే బలమైన పార్టీలు ఉన్నాయని, అవి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇండియా (సీబీఐ), ఇన్కం ట్యాక్స్ డిపార్ట్మెంట్ (ఐటీ) అని శివసేన (యూబీటీ) అధినేత ఉద్ధవ్ ఠాక్రే ఎద్దేవా చేశారు. ఇటీవల బీజేపీ నిర్వహించిన ఎన్డీఏ భాగస్వామ్యపక్షాల సమావేశాన్ని ఉద్దేశిస్తూ.. ఎన్నికల ముందరే బీజేపీ తమది ‘ఎన్డీఏ ప్రభుత్వ’మని చెప్పుకుంటుందని, ఎన్నికలయ్యాక అది ‘మోదీ ప్రభుత్వం’గా మారిపోతుందని చురకలంటించారు. ‘ఎన్డీఏలో 36 పార్టీలు ఉన్నాయి. అందులో సీబీఐ, ఈడీ, ఐటీనే బలమైన పార్టీలు. మిగతా పార్టీలు ఎక్కడున్నాయి? చాలా పార్టీలకు ఒక్క ఎంపీ కూడా లేరు’ అని ఉద్ధవ్ పేర్కొన్నారు.
మణిపూర్ ఘర్షణలపై ప్రధాని వైఖరిపైనా ఉద్ధవ్ విమర్శలు గుప్పించారు. జాతుల మధ్య వైరంతో రెండున్నర నెలలుగా అట్టుడుతుకున్న ఈశాన్య రాష్ట్రంలో ప్రధాని పర్యటించకపోవడంపై మండిపడ్డారు. ఉమ్మడి పౌరస్మృతిపై మాట్లాడుతూ.. బీజేపీ ముందు గోవధను నిషేధిస్తూ బిల్లు తేవాలని సూచించారు. చట్టం అందరికీ సమానమైతే, బీజేపీలోని అవినీతిపరులను కూడా శిక్షించాలన్నారు. విపక్ష పార్టీ నేతలే లక్ష్యంగా మోదీ సర్కారు కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పుతున్నదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే.