న్యూఢిల్లీ: ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) చట్టాన్ని అతిక్రమించరాదని, చట్టంలోని నాలుగు గోడలకే పరిమితం కావాలని సుప్రీంకోర్టు గురువారం హితవు చెప్పింది. ఈడీ దర్యాప్తు చేసిన కేసులలో పడుతున్న శిక్షల సంఖ్య 10% కన్నా తక్కువగా ఉండడం పట్ల కోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఈడీ ప్రతిష్టపైనా తాము ఆందోళన చెందుతున్నామని వ్యాఖ్యానించింది.
పీఎంఎల్ఏ కింద ఈడీకి గల అరెస్టు అధికారాలను సమర్థిస్తూ 2022లో ఇచ్చిన తీర్పును సమీక్షించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై ధర్మాసనం గురువారం విచారణ జరిపింది. గడచిన ఐదేండ్లలో ఈడీ నమోదు చేసిన 5,000 కేసులలో శిక్షలు మాత్రం 10 శాతం లోపే ఉన్నాయని, ఐదు నుంచి ఆరేళ్లు జుడిషియల్ కస్టడీలో ఉన్న తర్వాత నిందితులను నిర్దోషిగా విడిచిపెడితే అందుకు ఎవరు మూల్యం చెల్లించాలని ప్రశ్నించింది.