ED | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, ఆగస్టు 8 (నమస్తే తెలంగాణ): ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులంటే ఆర్థిక నేరగాళ్లకు వణుకు. సోదాలకు వాళ్లు వస్తున్నారంటేనే భయపడిపోతారు. అలాంటి ఈడీలో అసిస్టెంట్ డైరెక్టర్ అధికారి ఒకరు లంచానికి తెగబడ్డాడు. అడిగినంత సొమ్ము ఇవ్వకపోతే అక్రమ కేసు బనాయిస్తానని ఓ వ్యాపారిని బెదిరించాడు. దీంతో ఏం చేయాలో తెలియని బాధితుడు తనను రక్షించాలంటూ ఈడీకి జంట ఏజెన్సీగా చెప్పుకొనే సీబీఐని ఆశ్రయించాడు. ఇంకేముంది.. నిందితుడైన ఆ ఈడీ అధికారిని చాకచక్యంగా ప్లాన్ వేసి సీబీఐ అధికారులు పట్టుకొన్నారు.
ముంబైకి చెందిన ఓ వ్యక్తి నగల వ్యాపారం చేస్తాడు. సదరు వ్యాపారి అక్రమార్జనకు పాల్పడినట్టు ఎవరో చేసిన ఫిర్యాదుతో గత శనివారం, ఆదివారం ఆయన ఇంట్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్ సందీప్ సింగ్ యాదవ్ నేతృత్వంలో ఈ దాడులు జరిగాయి. అయితే, ఆ సోదాల్లో ఏమీ లభించకపోవడంతో.. తన బుద్ధిచూపించిన యాదవ్.. తనకు రూ. 25 లక్షలు ఇవ్వాలని వ్యాపారిని డిమాండ్ చేశాడు. లేకుంటే నీ కొడుకుపై అక్రమ కేసు బనాయిస్తానని బెదిరించాడు. బేరాలు పూర్తయ్యాక లంచం రూ. 20 లక్షలకు కుదిరింది. అయితే, ఈడీ అధికారిని ఎలాగైనా అరెస్ట్ చేయించాలని అనుకొన్న వ్యాపారి.. జరిగినదంతా సీబీఐ అధికారులకు రహస్యంగా విన్నవించారు. సీబీఐ అధికారులు చెప్పినట్టుగానే.. రూ.20 లక్షలను ఇస్తానని యాదవ్‌కు చెప్పిన వ్యాపారి.. ముంబైలోని ఓ ప్రాంతానికి రమ్మన్నారు. అక్కడ మాటువేసిన సీబీఐ అధికారులు లంచం తీసుకొంటుండగా యాదవ్‌ను అరెస్ట్ చేశారు. యాదవ్ గతంలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (సీబీడీటీ)లో పనిచేసినట్టు సీబీఐ అధికారులు తెలిపారు.
లక్నో: దేశంలో పిడుగుపాట్లు ఏటా వందల మందిని బలిగొంటున్నాయి. తాజా అధ్యయనం ప్రకారం, గత 54 ఏళ్లలో పిడుగుపాట్ల కారణంగా 1,01,309 మంది మరణించారు. అంటే సంవత్సరానికి సగటున 1,876 మంది ప్రాణాలు కోల్పోతున్నారు. 1967-2020 వరకు ఎన్సీఆర్బీ గణాం కాలను విశ్లేషించి నివేదిక రూపొందించారు.