శుక్రవారం 03 ఏప్రిల్ 2020
National - Feb 11, 2020 , 01:30:35

కుప్పకూలుతున్నది

కుప్పకూలుతున్నది
  • ప్రమాదంలో దేశ ఆర్థిక వ్యవస్థ
  • మోదీ సర్కారు అసమర్థతే కారణం
  • కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం ధ్వజం

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 10: దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలడానికి సిద్ధంగా ఉందని కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పీ చిదంబరం అన్నారు. అయినప్పటికీ అసమర్థుల కారణంగా ఆర్థిక వ్యవస్థ కోలుకోలేకపోతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పాలనలో దేశ ఆర్థిక పరిస్థితులు పూర్తిగా దిగజారిపోయాయన్న ఆయన ఇప్పుడు దేశంలో పెరుగుతున్న నిరుద్యోగం, పడిపోతున్న వినియోగ సామర్థ్యం.. ఈ రెండే ప్రధాన సమస్యలన్నారు. సోమవారం బడ్జెట్‌పై రాజ్యసభలో చర్చ జరిగింది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2020-21)గాను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ పార్లమెంట్‌లో ఈ నెల 1న బడ్జెట్‌ ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. కాగా, దేశ ఆర్థిక వ్యవస్థ నిర్మాణాత్మక సమస్యల్ని ఎదుర్కొంటున్నదని చిదంబరం ఈ సందర్భంగా అన్నారు. ప్రజల చేతికి మరింత నగదు అందాల్సిన అవసరం ఉందని, అప్పుడే కొనుగోళ్లు పెరిగి వినియోగ సామర్థ్యం బలపడుతుందని చెప్పారు. 


ఇదే సమయంలో పన్ను అధికారులను కట్టడి చేయాలని, పన్ను చెల్లింపుదారులపై వేధింపులు తగవని సూచించారు. ప్రధాని మోదీ పాలనలో నాలుగేండ్లు ప్రధాన ఆర్థిక సలహాదారుగా పనిచేసిన అర్వింద్‌ సుబ్రమణియన్‌.. దేశ ఆర్థిక వ్యవస్థ ఐసీయూలో ఉందని వ్యాఖ్యానించినట్లు గుర్తుచేశారు. కానీ పరిస్థితి ఐసీయూను దాటిపోయే ప్రమాదంలో పడిందని, పేషెంట్‌ (ఆర్థిక వ్యవస్థ)ను అసమర్థులైన డాక్టర్ల పర్యవేక్షణలో ఉంచారని పరోక్షంగా మోదీని, ఆయన మంత్రులను దుయ్యబట్టారు. మోదీ సర్కారు తమ తప్పుల్ని తాము గుర్తించే పరిస్థితిలో లేదన్న చిదంబరం.. పాత పెద్ద నోట్ల రద్దు నిర్ణయం, అసంపూర్ణ వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) విధానం అమలే ఆర్థిక వ్యవస్థను కుదేలు చేశాయన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం (2019-20) తొలి త్రైమాసికం (ఏప్రిల్‌-జూన్‌)లో 5 శాతానికి పతనమైన జీడీపీ.. 11 ఏండ్ల కనిష్ఠాన్ని తాకుతూ రెండో త్రైమాసికం (జూలై-సెప్టెంబర్‌)లో 4.5 శాతానికి క్షీణించిన విషయం తెలిసిందే.
logo