Economic Survey | న్యూఢిల్లీ, జనవరి 31: వ్యాపార, పారిశ్రామిక రంగాలు ఎంతలా విస్తరిస్తున్నా ఇప్పటికీ భారత్.. వ్యవసాయ ప్రధాన ఆధారిత దేశమేనని తాజా ఆర్థిక సర్వే చెప్పకనే చెప్పింది. కేంద్రం, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయాన్ని చిన్నచూపు చూస్తున్న నేపథ్యంలో వ్యవసాయ రంగం వృద్ధే.. దేశ ఆర్థిక లక్ష్యాల సాధనకు కీలకమని కుండ బద్దలు కొట్టింది. ఇంకా చెప్పాలంటే అధికారం కోసం రైతులకు ఎడాపెడా హామీలిచ్చి మోసం చేయడం.. దేశ వృద్ధిరేటును పరోక్షంగా అడ్డుకున్నట్టేనన్న సంకేతాలను ఈ సర్వే ఇవ్వడం గమనార్హం. వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2025-26)గాను పార్లమెంట్లో శనివారం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్న క్రమంలో శుక్రవారం ఆర్థిక సర్వే విడుదలైంది.
ముఖ్య ఆర్థిక సలహాదారు వీ అనంత నాగేశ్వరన్ నేతృత్వంలోని బృందం రూపొందించిన ఈ సర్వేను లోక్‌సభలో మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. ఇక ఇందులో భారతీయ వ్యవసాయ రంగంలో ఆశించిన స్థాయిలో ఉత్పాదకత ఉండటం లేదన్న ఆందోళన వ్యక్తమైంది. ప్రస్తుతం దేశంలో తృణధాన్యాల ఉత్పత్తి ఎక్కువగానే జరుగుతున్నా.. ఇతర దేశాలతో పోల్చితే మాత్రం పంట దిగుబడులు తక్కువేనన్నది. పెరుగుతున్న ఆహార అవసరాల దృష్ట్యా వ్యవసాయ రంగంలో ఉత్పాదకత మరింత మెరుగుపడాల్సి ఉన్నట్టు ఈ సందర్భంగా సర్వే అభిప్రాయపడింది.
రైతుల కష్టానికి తప్పక లాభం దక్కాల్సిందేనన్న ఆర్థిక సర్వే.. వ్యవసాయ పంటలకు గిట్టుబాటు ధర ఉండాల్సిందేనని చెప్పింది. అంతేగాక రైతులకు బ్యాంకింగ్, ఇతర సంస్థాగత రుణ సదుపాయాలను కల్పించాలన్నది. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయేతర కార్యకలాపాల దిశగా అత్యధికులు అడుగులు వేస్తున్నారన్న సర్వే.. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడమే దీనికి పరిష్కారంగా పేర్కొన్నది. అప్పుడే అంతా మళ్లీ వ్యవసాయంలోకి దిగుతారన్నది. ఉత్పాదకత పెరగడానికి ఇది చాలా ముఖ్యమని కూడా నొక్కిచెప్పింది. దేశ జీడీపీలో వ్యవసాయ రంగం వాటా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దాదాపు ఐదో వంతు వృద్ధిరేటు ఇక్కడి నుంచే వస్తున్నది మరి.
ఆహార ద్రవ్యోల్బణం.. కూరగాయలు, పప్పుధాన్యాల అధిక ధరలతోనే చోటుచేసుకుంటున్నదని ఆర్థిక సర్వే స్పష్టం చేసింది. ముఖ్యంగా టమాట, ఉల్లి ధరలు పెరిగిపోయాయని, గత కొన్నేండ్లలో ఉల్లి ఉత్పత్తి ఆశించిన స్థాయిలో లేకపోవడంతో మార్కెట్లో డిమాండ్‌కు తగ్గ సరఫరా లేదని, దాంతో ధరలు ఎగబాకాయని పేర్కొన్నది. ఇక అననుకూల వాతావరణ పరిస్థితులు ఆహార ద్రవ్యోల్బణాన్ని ఎగదోస్తున్నాయన్న సర్వే.. ఇప్పటికీ దేశంలో అత్యధిక విస్తీర్ణంలో సాగు భూములు వర్షాధారంగా ఉండటమే దీనంతటికి కారణమని పేర్కొనడం గమనార్హం. తద్వారా సాగు నీటి ప్రాజెక్టులకు అటు కేంద్ర, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాధాన్యతనివ్వడం లేదని వాపోయినైట్టెంది. ఇక పంట దిగుబడులు వచ్చినా.. వాటిని మార్కెట్‌కు తరలించడం, నిల్వ చేయడం వంటి వ్యవస్థలు బలహీనంగా ఉన్నాయని, ఇవి కూడా ధరల పెరుగుదలకు దారితీస్తున్నాయంటూ ప్రభుత్వ అసమర్థతను ఎండగట్టింది.
కందిపప్పు, ఉల్లి, టమాట సాగు పెరగాలన్న సర్వే.. ఒకే రకం పంటలు కాకుండా రకరకాల పంటలను సాగు చేసేలా రైతులను ప్రోత్సహించాలని ప్రభుత్వానికి సూచించింది. ఈ క్రమంలోనే ఉద్యానవన పంటల సాగు పెరగాలన్నది. అలాగే పశు సంపద పెరగాలని, మత్స్య, కోళ్ల పెంపకాలకు పెద్దపీట వేయాలని కూడా చెప్పింది. మొత్తానికి ద్రవ్యోల్బణం విజృంభణ, దేశ ఆర్థిక వ్యవస్థపై దాని ప్రతికూల ప్రభావం నడుమ సర్వేలో వ్యవసాయ రంగం బలోపేతానికి పేర్కొన్న సూచనలు ఇప్పుడు మిక్కిలి ప్రాధాన్యాన్నే సంతరించుకుంటున్నాయి. ఎగబాకుతున్న ఆహార ద్రవ్యోల్బణం.. రిటైల్, హోల్‌సేల్ ద్రవ్యోల్బణాలనూ పైపైకి తీసుకెళ్తోంది. ఈ పరిణామం రిజర్వ్ బ్యాంక్ వడ్డీరేట్ల కోతలకు అడ్డం పడుతున్నది. అధిక వడ్డీరేట్లతో ఆటో, నిర్మాణ దాని అనుబంధ రంగాల ప్రగతి దెబ్బ తింటుండగా.. యావత్తు ఆర్థిక వ్యవస్థే మసకబారిపోతున్నది.