ECI | బిహార్ ఓటరు జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్‌పై వస్తున్న విమర్శల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ఆదివారం నేషనల్ మీడియా సెంటర్లో విలేకరుల సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ మాట్లాడుతూ.. భారత రాజ్యాంగం ప్రకారం.. 18 ఏళ్లు నిండిన ప్రతి భారత పౌరుడు ఓటరుగా మారాలని.. ఓటు వేయాలన్నారు. బిహార్‌లో ఆగస్టు ఒకటి నుంచి సెప్టెంబర్ ఒకటి వరకు సమయం ఇచ్చామన్నారు. ఇంకా 15 రోజుల సమయం ఉందన్నారు. దరఖాస్తు చేసుకోకుండా ఎలా ఓటు హక్కు వస్తుందని ఆయన ప్రశ్నించారు. చట్టం ప్రకారం ప్రతి రాజకీయ పార్టీ ఎన్నికల సంఘం ద్వారా నమోదవుతుందని అందరికీ తెలుసునన్నారు. అప్పుడు ఎన్నికల సంఘం రాజకీయ పార్టీల మధ్య వివక్షతను ఎలా చూపుతుందని ప్రశ్నించారు. ఎన్నికల కమిషన్‌కు అన్ని పార్టీలు సమానమేనని.. ఎవరైనా ఏ రాజకీయ పార్టీకి చెందినవారైనా ఎన్నికల సంఘం తన రాజ్యాంగ విధి నుంచి తప్పించుకోలేదన్నారు.
గత రెండు దశాబ్దాలుగా దాదాపు అన్ని రాజకీయ పార్టీలు ఓటరు జాబితాలోని తప్పులను సరిదిద్దాలని డిమాండ్ చేస్తున్నాయన్నారు. అందు కోసమే ఎన్నికల సంఘం బిహార్ నుంచి ప్రత్యేక ఇంటెన్సివ్ సవరణను ప్రారంభించిందన్నారు. సర్ ప్రక్రియలో బూత్ స్థాయి అధికారులు, అన్ని రాజకీయ పార్టీలు నామినేట్ చేసిన 1.6 లక్షల మంది బీఎల్ఏలు కలిసి ముసాయిదా జాబితాను సిద్ధం చేశారన్నారు. బీహార్ సర్ ప్రక్రియ ప్రారంభమైన తర్వాత ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న తొలి మీడియా సమావేశం ఇదేనన్నారు. ఎన్నికల కమిషన్ చరిత్రలో ఎన్నికలకు సంబంధించి అంశం గురించి కాకుండా ఏర్పాటు చేసిన తొలి విలేకరుల సమావేశం ఇదే కావొచ్చన్నారు. ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలన్నీ నిరాధారమైనవన్నారు. ఓటరు జాబితాను ప్రతి పార్టీ బూత్ లెవల్లో చూసుకుంటుందని.. సంస్కరణల్లో భాగంగానే బిహార్‌లో ఓటరు జాబితాను సవరిస్తున్నట్లు సీఈసీ తెలిపారు. ఈ సంస్కరణలో అన్ని పార్టీలు పాల్గొంటున్నాయని చెప్పారు. ఓటరు జాబితా తయారీలో స్పష్టమైన వైఖరిని అవలంభిస్తున్నామని, బిహార్‌లో ఏడుకోట్ల మంది ఓటర్లు ఉన్నారని వివరించారు. అయితే, రాజ్యాంగ సంస్థలను అవమానించడం ఏమాత్రం సరికాదన్నారు. మిషన్ రీడబుల్ లిస్ట్‌తో ఓటర్ల గోప్యతకు భంగం వాటిల్లుతుందని.. 2019లో సుప్రీంకోర్టు చెప్పిందన్నారు.
బిహార్‌లో కొందరి ఫొటోలు మీడియాలో వచ్చాయని, ఓటర్ల వ్యక్తిగత గోప్యత కల్పించాల్సిన బాధ్యత మాదేనన్నారు. ఓట్ల చోరీ అంటూ ప్రచారం చేయడం రాజ్యాంగాన్ని అవమానించడమేనని, దుష్ప్రచారాల పట్ల మేం ఏమాత్రం భయపడమని.. ఎన్ని ఆరోపణలు వచ్చినా తాము పని చేసుకుంటూ వెళ్తామన్నారు. ఈసీ పారదర్శకంగా వ్యవహరిస్తోందన్నారు. ఓటర్ల జాబితాపై 28,370 మంది అభ్యంతరాలు వ్యక్తం చేశారన్నారు. ఓటరు జాబితాను బూత్ లెవల్ అధికారులు, పార్టీలు, ఏజెంట్లు కలిసి పరిశీలిస్తారన్నారు. అసత్య ప్రచారాలపట్ల ఏమాత్రం భయపడమని.. ఎంతగా దుష్ప్రచారం చేసినా తమ పని తాము చేసుకుంటూ ముందుకెళ్తామని.. ఈసీ తలుపులు అందరికీ తెలిచే ఉంటాయన్నారు. పార్టీలు, నేతల పట్ల మాకు భేదభావాలు.. పక్షపాతాలు ఉండవని సీఈసీ స్పష్టం చేశారు. రాజకీయ లబ్ధి కోసమే ఓటర్లను టార్గెట్ చేస్తున్నారని ఆరోపించారు. బిహార్‌లో ఓటర్ల జాబితాను పారదర్శకంగా రూపొందిస్తున్నామన్న ఆయన.. ఓటరు జాబితాలో ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఓట్ల చోరీ సాధ్యమా? అని ప్రశ్నించారు.