Jamili Elections | న్యూఢిల్లీ, జనవరి 20: దేశంలో ఏకకాలంలో లోక్‌సభ, అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ (ఈవీఎం)ల నిమిత్తం ప్రతి 15 ఏండ్లకోసారి 10 వేల కోట్ల రూపాయల నిధులు అవసరమవుతాయని భారత ఎన్నికల సంఘం వెల్లడించింది. ఈ మేరకు కేంద్ర న్యాయ శాఖకు వివరాలు పంపింది. ప్రస్తుతమున్న ఈవీఎంల జీవిత కాలం 15 ఏండ్లని, జమిలి ఎన్నికలను వరుసగా మూడుసార్లు నిర్వహించడానికి వాటిని వినియోగించవచ్చునని ఈసీ తెలిపింది.
ఈ ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికలకు 11.80 లక్షల పోలింగ్ స్టేషన్లు అవసరమవుతాయని అంచనా వేస్తున్నామంది. జమిలి ఎన్నికలు నిర్వహిస్తే ఒక్కో పోలింగ్ బూత్‌కు రెండు సెట్ల ఈవీఎంలు అవసరమవుతాయని, అందులో ఒకదానిని లోక్‌సభకు, రెండో దానిని అసెంబ్లీ పోలింగ్‌కు వినియోగిస్తామన్నారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని పోలింగ్ తేదీన కంట్రోల్, బ్యాలెట్ యూనిట్లు, వీవీప్యాట్ మిషన్లు కొన్ని రిజర్వ్‌లో ఉంచాలన్నారు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటే జమిలి ఎన్నికలకు కనీసం 46,75,100 బీయూలు, 33,63,300 సీయూలు, 36,62,600 వీవీప్యాట్లు అవసరమవుతాయని వివరించింది.