Sharad Pawar | కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ)పై సీనియర్ రాజకీయవేత్త, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధినేత శరద్ పవార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన సోదరుడి కొడుకు, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ సారధ్యంలోని ఎన్సీపీ గ్రూప్‌కు ఎన్సీపీ పేరు, ఎన్నికల గుర్తును ఈసీ అప్పగించడం `ఆశ్చర్యం` కలిగించిందన్నారు. పార్టీని స్థాపించిన వారి నుంచి దొంగిలించి ఇతరులకు అప్పగించిందని వ్యాఖ్యానించారు.
పార్టీ కార్యక్రమాలు, సిద్ధాంతం మాత్రమే ప్రజలకు ముఖ్యం అని శరద్ పవార్ చెప్పారు. కానీ పార్టీ ఎన్నికల గుర్తు కేవలం కొద్ది కాలం మాత్రం ఉపయోగకరం అని వ్యాఖ్యానించారు. `ఈసీ రూలింగ్‌ను ప్రజలు సమర్థించరని నేను విశ్వసిస్తున్నా. దీనిపై మేం సుప్రీంకోర్టును ఆశ్రయించాం` అని చెప్పారు. తమ పార్టీ గుర్తును మాత్రమే కాగా తమ పార్టీని దొంగిలించి మరీ ఈసీ ఇతరులకు అప్పగించిందన్నారు. `పార్టీని స్థాపించి, నిర్మించిన వారి చేతుల నుంచి ఈసీ దొంగిలించి ఇతరులకు అప్పగించింది. గతంలో ఇటువంటి ఘటనలు జరుగలేదు` అని పేర్కొన్నారు.
1999లో అప్పటి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ విదేశీయత పేరుతో పార్టీ నుంచి బయటకు వచ్చిన శరద్ పవార్.. సొంతంగా నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ స్థాపించారు. 1999 లోక్‌సభ ఎన్నికల్లో విడిగా పోటీ చేసినా, మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీతో కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేశారు. 2004లో లోక్‌సభ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీతో కలిసి పోటీ చేశారు. నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ సారధ్యంలోని యూపీఏ సర్కార్‌లో వ్యవసాయ మంత్రిగా పని చేశారు.