న్యూఢిల్లీ, మే 27 : ఓటర్ల జాబితా సమగ్ర సవరణ (సర్)ను నిర్వహించే అధికారం ఎన్నికల కమిషన్ (ఈసీ)కి ఉన్నదని సర్వోన్నత న్యాయస్థానం తీర్పునిచ్చింది. ఈ ప్రక్రియ నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించేందుకు రాజ్యాంగం నిర్దేశించిన ఆదేశిక సూత్రాలకు జీవం పోస్తుంది అని వ్యాఖ్యానించింది. సర్ ప్రక్రియపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం కీలక తీర్పును వెలువరించింది. ఎన్నికలు స్వేచ్ఛాయుతంగా, నిష్పక్షపాతంగా జరుగాలన్న రాజ్యాంగ నిర్దేశాన్ని సర్ ప్రక్రియ ముందుకు తీసుకెళ్తుందని పేర్కొన్నది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 324, ప్రజాప్రాతినిధ్యం చట్టంలోని సెక్షన్ 21(3) ప్రకారం ప్రత్యేక సవరణలు చేపట్టేందుకు ఎన్నికల సంఘానికి అధికారం ఉన్నదని ధర్మాసనం స్పష్టంచేసింది.
బీహార్లో సర్ ప్రక్రియను సవాలు చేస్తూ దాఖలైన పలు పిటిషన్లపై విచారణ జరిపిన ధర్మాసనం.. ఇక్కడ ఏ చట్టం, రాజ్యాంగ నిబంధన ఉల్లంఘనకు గురికాలేదని తెలిపింది. ఓటర్ల జాబితా నుంచి పేరు తొలగించినంత మాత్రాన ఓ వ్యక్తి దేశ పౌరుడు కాదు అని చట్టబద్ధంగా ప్రకటించినట్టు కాదని పేర్కొన్నది. ప్రజాస్వామ్య ప్రక్రియ విశ్వసనీయత.. ఓటర్ల జాబితా కచ్చితత్వంపై ఆధారపడి ఉంటుంది అని వ్యాఖ్యానించింది. వివాదాస్పదమైన ఈ ప్రక్రియను కేవలం పరిపాలనా సౌలభ్యం కోసం చేపట్టినదిగా తాము నిర్ధారించలేకపోతున్నామని తెలిపింది. ఈ కేసులో పిటిషనర్, ఎన్నికల విశ్లేషకుడు, సామాజిక కార్యకర్త యోగేంద్ర యాదవ్ తీర్పుపై స్పందిస్తూ.. ఈ తీర్పు ఊహించిందేనని, అందుకే తాను కోర్టుకు వెళ్లలేదని తెలిపారు. ‘ఈసీ చేపట్టిన సర్ ప్రక్రియ రాజ్యాంగబద్ధమేనని సుప్రీంకోర్టు తీర్పు చెప్పడం నేటి వార్త కాదు. నిజమైన వార్త ఏమిటంటే.. ఇకపై ఈ దేశంలో ఎవరు ఓటు వేయాలి ఎవరు వేయకూడదు అన్నది బీజేపీ నిర్ణయిస్తుంది. ’ అని వ్యాఖ్యానించారు.