Manish Tewari : ఎన్నికల సంస్కరణల (Election reforms) పై మంగళవారం లోక్‌సభ (Lok Sabha) లో వాడీవేడి చర్చ జరుగుతున్నది. ఎన్నికల సంస్కరణలపై చర్చలో భాగంగానే ఓటర్ల జాబితా ‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (Special Intensive Revision)’ పై చర్చిస్తున్నారు. ఈ చర్చలో ఎంపీ మనీశ్ తివారీ (MP Manish Tewari) నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ కేంద్రంపై ఎదురుదాడికి దిగింది. ఓటర్ల జాబితాలో ప్రత్యేక సమగ్ర సవరణ చేసే హక్కు ఎన్నికల సంఘానికి లేదని మనీశ్ తివారీ వ్యాఖ్యానించారు.
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం నిష్పక్షపాత వైఖరి, చట్టబద్ధమైన అధికారాలపై మనీశ్ తివారీ ప్రశ్నలు లేవనెత్తారు. కేంద్ర ఎన్నికల సంఘం నిష్పక్షపాత వైఖరిని అవలంభిస్తున్నదా..? అనే విషయంలో చాలామంది సభ్యులు ప్రశ్నలు లేవనెత్తుతుండటం దురదృష్టకరమని అన్నారు.
ఎన్నికల సంస్కరణల్లో భాగంగా ముందుగా సవరించాల్సినది ఎన్నికల సంఘం సభ్యులను ఎన్నుకునే విధానాన్నేనని మనీశ్ తివారీ చెప్పారు. కేంద్ర ఎన్నికల సంఘంలో ప్రధాన ఎన్నికల కమిషనర్, ఇద్దరు ఎన్నికల కమిషనర్లతోపాటు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి, లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడికి కూడా చోటు కల్పిస్తే బాగుంటుందనేది తన సూచన అని చెప్పారు.
ఎన్నికల సంస్కరణలపై చర్చలో కాంగ్రెస్ పార్టీ తరఫున మనీశ్ తివారీతోపాటు లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌గాంధీ, మరో సీనియర్ నాయకుడు కేసీ వేణుగోపాల్, వర్ష గైక్వాడ్, మహ్మద్ జావేద్, ఉజ్వల్ రమణ్‌సింగ్, ఇషా ఖాన్, మల్లు రవి, ఇమ్రాన్ మసూద్, గొవాల్ పడవి, ఎస్ జ్యోతిమని పాల్గొననున్నట్లు పార్టీ తెలిపింది.