Earthquake | అరుణాచల్ ప్రదేశ్ (Arunachal Pradesh)లో భూకంపం (Earthquake) సంభవించింది. సోమవారం మధ్యాహ్నం 2:38 గంటల సమయంలో భూమి ఒక్కసారిగా కంపించింది. రిక్టరు స్కేలుపై భూకంపం తీవత్ర 3.5గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (National Center for Seismology) వెల్లడించింది. అరుణాచల్ ప్రదేశ్లోని షియోమి (Shi Yomi) కేంద్రంగా భూమికి 10 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రాన్ని గుర్తించినట్లు తెలిపింది. అయితే, భూ ప్రకంపనలు స్వల్ప స్థాయిలోనే ఉండటంతో ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదు. భూమి ఒక్కసారిగా కంపించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇళ్లు, కార్యాలయాల నుంచి బయటకు పరుగులు తీశారు.
కాగా, గత మూడు రోజులుగా భూకంపం అంటేనే ప్రజలు వణికిపోతున్నారు. శుక్రవారం మధ్యాహ్నం మయన్మార్ (Myanmar), థాయ్లాండ్ దేశాలను నిమిషాల వ్యవధిలోనే అత్యంత శక్తిమంతమైన భూకంపాలు వణికించిన విషయం తెలిసిందే. ఈ విపత్తు తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ముఖ్యంగా మయన్మార్లో వేల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఈ విపత్తులో 2,028 మంది మరణించినట్లు మయన్మార్ సైన్యాన్ని ఊటంకిస్తూ వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదించింది. సుమారు 3,408 మంది గాయపడ్డట్లు పేర్కొంది. 300 మంది ఆచూకీ గల్లంతైనట్లు తెలిపింది. అయితే, మయన్మార్ స్టేట్ మీడియా మాత్రం 1700 మంది మరణించినట్లు వెల్లడించింది. మరోవైపు థాయ్లాండ్లోనూ పలువరు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రకృతి ప్రకోపానికి భారీ భవంతులు పేకమేడల్లా కూలిపోయాయి. రోడ్లు, వంతెనలు, ఎయిర్పోర్ట్లు, ఇళ్లు ధ్వంసమయ్యాయి. ప్రస్తుతం ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ విపత్తు కారణంగా మృతుల సంఖ్య 10 వేలు దాటే అవకాశముందని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే అంచనా వేస్తున్నది.
Also Read..
Myanmar | 2 వేలు దాటిన మయన్మార్ భూకంపం మృతుల సంఖ్య.. 3 వేల మందికి గాయాలు
Myanmar | మయన్మార్ భూకంపం ఘటనలో 700 మంది ముస్లింలు మృతి.. 60 మసీదులు ధ్వంసం
Myanmar | భూకంపం అనంతరం మూడు రోజుల తర్వాత.. శిథిలాల నుంచి సజీవంగా బయటపడ్డ మహిళ