Earthquake | రోహ్తక్లో గురువారం తెల్లవారు జామున రిక్టర్ స్కేల్లో 3.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. రోహ్తక్ నగరానికి తూర్పున 17 కిలోమీటర్ల దూరంలో భూమి ఉపరితలం నుంచి 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం గుర్తించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ తెలిపింది. వేకువ జామున భూకంపం సంభవించడంతో జనం ఇండ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అయితే, భూకంపంతో నష్టం జరిగినట్లు ఎలాంటి సమాచారం అందలేదని అధికారులు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా గత ఎనిమిది రోజుల్లో హర్యానాలో నాలుగోసారి భూకంపం సంభవించింది. ఈ నెల 11న, ఝజ్జర్ జిల్లాలో 3.7 తీవ్రతతో భూ ప్రకంపనలు వచ్చాయి. ఆ తర్వాత కొన్ని గంటల తర్వాత అదే ప్రాంతంలో 4.4 తీవ్రతతో మళ్లీ ప్రకంపనలు నమోదయ్యాయి. ఢిల్లీ ఎన్సీఆర్ వ్యాప్తంగా భూమి కంపించింది. జులై 10న రోహ్తక్ ప్రాంతంలో 2.5 తీవ్రత కంటే ఎక్కువగానే భూప్రకంపనలు వస్తున్నాయని గణాంకాలు పేర్కొంటున్నాయి.