Earthquake | భారత్‌పై దాడులకు తెగబడుతున్న పాకిస్తాన్ భూ ప్రకంపనలతో వణికిపోయింది. శనివారం తెల్లవారుజామున 01.44 గంటలకు పాకిస్తాన్లో భూకంప ప్రకంపనలు సంభవించాయి. నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) ప్రకారం.. రిక్టర్ స్కేల్‌పై 4.0తో ప్రకంపనలు నమోదయ్యాయి. భూమికి పది కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం గురించినట్లు పేర్కొంది. ఇటీవల పాక్‌లో భూకంపం రావడంతో ఇది నాలుగోసారి. ఇంతకు ముందు మే 5న 4.2 తీవ్రతతో భూకంపం వచ్చింది. పాకిస్తాన్ యురేషియన్, ఇండియన్ టెక్టోనిక్ ప్లేట్ల కలిసే ప్రదేశంలో ఉంది. దాంతో తరచుగా శక్తివంతమైన భూకంపాలు వస్తుంటాయి. బలూచిస్తాన్, ఖైబర్ పఖ్తున్ఖ్వా, గిల్గిట్-బాల్టిస్తాన్ తదితర ప్రాంతాలు యురేషియన్ ప్లేట్ దక్షిణ అంచున ఉండడం వల్ల భూకంపాల బారినపడుతున్నాయి.
ఇదిలా ఉండగా.. ఇటీవల భారత్ లక్ష్యంగా పాకిస్తాన్ దాడులకు తెగబడుతున్న నేపథ్యంలో ఆ దేశంపై సైతం ప్రకృతి పగబట్టిందని పలువురు నెటిజన్స్ పేర్కొంటున్నారు. ఏప్రిల్ 22న జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రవాదులు పర్యాటకులను కాల్చి చంపిన విషయం తెలిసిందే. దాంతో భాతర్‌లో తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. ఉగ్రవాదులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని డిమాండ్ పెరిగింది. ఈ క్రమంలోనే ఈ నెల 6-7 మధ్య భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టి 24 మిస్సైల్స్‌తో తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది. ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేయడాన్ని జీర్ణించుకోలేని పాకిస్తాన్ మే 8 నుంచి భారత్‌లోని 15 నగరాలపై దాడికి ప్రయత్నించింది. డ్రోన్లు, మిస్సైల్స్‌తో దాడికి యత్నించగా.. వాటిన్నింటిని భారత రక్షణ వ్యవస్థ కూల్చివేసింది.