గువాహటి : ఈశాన్య భారతం, పశ్చిమ బెంగాల్‌లలో ఆదివారం భూకంపం సంభవించింది. దీని తీవ్రత భూకంప లేఖినిపై 5.8గా నమోదైంది. ఆదివారం మధ్యాహ్నం 4.41 గంటలకు మొదటిసారి భూమి కంపించింది. ఆ తర్వాత గంటన్నర సమయంలో మూడుసార్లు చిన్న ప్రకంపనలు వచ్చాయి. అస్సాంలో భూకంపం వల్ల ఇద్దరు గాయపడగా, కొన్ని ఇండ్లు దెబ్బతిన్నాయి. మణిపూర్ పశ్చిమ ప్రాంతాలు, అరుణాచల్ ప్రదేశ్ రాజధాని ఈటా నగర్లలో కూడా భూమి కంపించింది.
అస్సాం సరిహద్దుల్లోని పశ్చిమ బెంగాల్ ప్రాంతాలపై కూడా ఈ ప్రభావం కనిపించింది. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మకు ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ చేసి, వివరాలు అడిగి తెలుసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి అన్ని విధాలుగా సహాయపడతామని చెప్పారు.