Covid Restrictions | కరోనా కొత్త వేరియంట్ మరోసారి ప్రపంచాన్ని వణికిస్తున్నది. చైనా, జపాన్, బ్రెజిల్, అమెరికాతో సహా అనేక దేశాల్లో కేసులు పెరుగుతున్నాయి. రాబోయే మూడు నెలల్లో 800 మిలియన్లకుపైగా జనం వైరస్ బారినపడే ప్రమాదం ఉందని అంచనా. అదే సమయంలో మిలియన్ కంటే ఎక్కువ మరణాలు నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఓ నివేదిక ప్రకారం.. రాబోయే మూడు నెలల్లో ప్రపంచంలో పదిశాతం కంటే ఎక్కువ మంది వైరస్ బారినపడే అవకాశం ఉంది. భారత్‌లోనూ ప్రమాదం తప్పదనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
మరో వైపు ప్రపంచవ్యాప్తంగా కేసుల దృష్ట్యా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో రాబోయే రోజుల్లో కేంద్రం కొత్తగా ఆంక్షలు అమలు చేసే అవకాశం ఉన్నది. వీటిని అందరూ తప్పనిసరి పాటించాల్సిందేనని అధికార వర్గాలు పేర్కొన్నాయి. కరోనా పరిస్థితిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని, ప్రస్తుతానికైతే భారత్‌లో పెద్దగా ప్రమాదమేమి లేదని చెప్పారు. అయినప్పటికీ అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం కొవిడ్ ప్రోటోకాల్స్‌ను మళ్లీ అమలు చేసేందుకు ఆలోచన చేస్తున్నట్లు చెప్పారు. అయితే, కరోనా నివారణకు ఎలాంటి సన్నాహాలు చేపట్టనున్నదో ఓ సారి తెలుసుకుందాం..
పెరుగుతున్న కరోనా కేసుల దృష్ట్యా, బహిరంగ ప్రదేశాల్లో మళ్లీ ముసుగులు ధరించడం తప్పనిసరి చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా కరోనా లక్షణాలున్న వారికి నిబంధనలు కఠినంగా అమలు చేసే అవకాశాలున్నాయి. దగ్గు, జలుబు, తదితర ఏ సమస్యతో బాధపడుతున్నా మాస్క్‌లు ధరించడం తప్పనిసరి చేసే అవకాశాలున్నాయి.
కరోనా సెకండ్ వేవ్ తర్వాత జనం సామాజిక దూర నియమాన్ని పాటించడం మానేశారు. తాజాగా మళ్లీ ఈ నిబంధనను కఠినంగా అమలు చేసే అవకాశం ఉంది.
ఢిల్లీ, ముంబైతో సహా అన్ని ప్రధాన విమానాశ్రయాలలో ర్యాండమ్ కరోనా పరీక్షలు ప్రారంభించే అవకాశాలున్నాయి. ముఖ్యంగా కరోనా ప్రభావిత దేశాల నుంచి తిరిగి వస్తున్న వారి విచారణపై దృష్టి సారించనున్నారు. అలాంటి వారిని పరీక్షించి, వారిలో ఇన్ఫెక్షన్ ఉన్నట్లు గుర్తించినట్లయితే, జీనోమ్ సీక్వెన్సింగ్ చేయబడుతుంది. ఇప్పటికే విమానాశ్రయాల్లో పరీక్షలు చేయనున్నట్లు ప్రకటించగా.. రైల్వే స్టేషన్లు, బస్టాండ్లలో ర్యాండమ్ టెస్టింగ్‌ను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
కరోనా వ్యతిరేకంగా కేంద్రం ఇప్పటికే వ్యాక్సిన్లు పంపిణీ చేసింది. అయితే, 23కోట్ల మందికి ప్రికాషన్ డోస్ వేసింది. మిగతా వారికి బూస్టర్ డోస్ వేయడంపై దృష్టి సారించింది. గరిష్ట సంఖ్యలో ప్రజలు బూస్టర్ డోస్ పొందేలా ఏర్పాట్లు చేయనున్నది.
దేశవ్యాప్తంగా అనేక ల్యాబుల్లో జీనోమ్ సీక్వెన్సింగ్ ప్రక్రియను కేంద్రం మళ్లీ ప్రారంభించింది. కరోనా బాధితుల నుంచి సేకరించిన నమూనాలను పరిశీలించి, కొత్త వేరియంట్లను గుర్తించనున్నారు. కొత్త వేరియంట్ల గుర్తిస్తే విస్తరించకుండా త్వరగా చర్యలు తీసుకోవచ్చు.
టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీట్మెంట్
భారతదేశంలో కరోనా కేసులు పెరగకుండా నిరోధించడానికి, టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీట్మెంట్పై దృష్టి పెట్టాలని కేంద్రం నిర్ణయించింది. దీంతో వీలైనంత ఎక్కువ మందికి పరీక్షలు చేయనున్నారు. ఎవరైనా కరోనా బారినపడితే అతని కాంటాక్టులను సైతం పరీక్షించనున్నారు. త తర్వాత బాధితులకు సకాలంలో చికిత్స చేసే వీలుంటుంది.
ప్రస్తుతం భారత్‌లో కొవిడ్ అదుపులోనే ఉన్నది. భారతదేశంలో ఇప్పటివరకు 4.46 కోట్ల మంది మహమ్మారి బారినపడ్డారు. వీరిలో 4.41 కోట్ల మందికిపైగా కోలుకోగా, 5.30 లక్షల మంది రోగులు మరణించారు. ప్రస్తుతం భారతదేశంలో 4,527 మంది రోగులు చికిత్స పొందుతున్నారు. యాక్టివ్ కేసుల విషయంలో భారత్ ప్రస్తుతం ప్రపంచంలో 90వ స్థానంలో ఉంది.