Moustache | ఎన్నికలు వచ్చాయంటే చాలు రాజకీయ నాయకులు ప్రచారంలో మునిగిపోతారు. ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ప్రజల్లోకి వెళ్తారు. ఇందులో భాగంగా ఓటర్లను, ప్రత్యేకంగా యువతను ప్రసన్నం చేసుకునేందుకు వివిధ హామీలు ఇస్తుంటారు. యువతకు నాణ్యమైన విద్య అందించడంతోపాటు క్రికెట్ కిట్లు, జిమ్ సెంటర్లు, ఇండోర్, అవుట్డోర్ స్టేడియమ్స్ నిర్మిస్తామంటూ హామీల వర్షం కురిపిస్తారు. కానీ, గుజరాత్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేస్తున్న మగన్‌భాయ్ సోలంకి మాత్రం వినూత్న రీతిలో ప్రచారం చేస్తున్నాడు. ఈ ఎన్నికల్లో తనను గెలిపిస్తే పొడవాటి మీసాలు పెంచుకునే యువతకు ప్రత్యేక భత్యం ఇచ్చేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తానంటూ హామీ ఇస్తున్నాడు.
గుజరాత్‌లోని సబర్కాంత జిల్లాకు చెందిన 57 ఏళ్ల మగన్‌భాయ్ సోలంకి 2012లో ఆర్మీ నుంచి పదవీ విరమణ పొందాడు. ఆయనకు మీసాలు పెంచడం అంటే ఆసక్తి. ప్రస్తుతం సోలంకికి 2.5 పొడవుగల మీసాలు ఉంటాయి (ఇరువైపులా కలిపి 5 అడుగులు). ప్రస్తుతం గుజరాత్లో జరుగుతున్న ఎన్నికల్లో హిమ్మత్‌నగర్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు. డిసెంబర్ 5వ తేదీన రెండో విడతలో భాగంగా ఈ నియోజకవర్గానికి ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో మీసాలే ఎజెండాగా తాజా ఎన్నికల్లో ఆయన ప్రచారం చేస్తుండటం గమనార్హం.
ప్రచారంలో భాగంగా మగన్‌భాయ్ సోలంకి మాట్లాడుతూ… ‘ఆర్మీలో ఉన్నప్పుడు నా రెజిమెంట్‌లో మీసాల వ్యక్తిగా నేను చాలా గుర్తింపు పొందా. మీసాలు పెంచుకునే వారికి ప్రభుత్వం ప్రత్యేక భత్యం ఇవ్వాలి. నా మీసాల నిర్వహణ కోసం ప్రభుత్వం నుంచి ప్రత్యేక భత్యం అందుకున్నా. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజలు నా మీసాలు చూసి సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చిన్నారులుసైతం వాటిని తాకేందుకు ఆసక్తి చూపారు. పలువురు యువత మీసాలను పెంచేందుకు చిట్కాలు అడుగుతున్నారు. మీసాలు పెంచడంపై యువతను నేను ప్రోత్సహిస్తా. ఎన్నికల్లో గెలిపిస్తే మీసాల నిర్వహణకు సంబంధించి ప్రత్యేక భత్యం ఇచ్చేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తా. రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగుల సమస్యలపై పోరాటం చేస్తా. ఎన్నికల్లో గెలిచే వరకూ మళ్లీ మళ్లీ.. పోటీ చేస్తూ నే ఉంటా’ అని సోలంకి పేర్కొన్నారు.