Rawalpindi Stadium | ఢిల్లీ, మే 8: ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో దాయాదుల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. మంగళవారం అర్ధరాత్రి పాక్‌లోని ఉగ్ర స్థావరాలపై దాడి జరగగా.. తాజాగా రావల్పిండి క్రికెట్ స్టేడియంపై డ్రోన్ దాడి జరిగింది. ఈ దాడిలో స్టేడియంలోని కొంత భాగం దెబ్బతిన్నది. పీఎస్ఎల్లో భాగంగా గురువారం రాత్రి 8 గంటలకు ఈ స్టేడియంలో మ్యాచ్ జరగాల్సి ఉండగా.. కొన్ని గంటల ముందుగా ఈ దాడి జరిగింది. దీంతో పెషావర్ జల్మీ వర్సెస్ కరాచీ కింగ్స్ మధ్య జరగాల్సిన మ్యాచ్‌ను వాయిదా వేశారు.
భారత్‌లోని 15 మిలిటరీ స్థావరాలపై పాక్ దాడులు చేసేందుకు ప్రయత్నించడంతో ప్రతిస్పందనగా ఈ దాడి జరిగినట్టు తెలుస్తున్నది. లాహోర్‌లోని ఎయిర్ డిఫెన్స్ రాడార్ సిస్టమ్‌ను భారత్ ధ్వంసం చేసింది. లాహోర్, గుజ్రాన్వాలా, చక్వాల్, బహవల్పూర్, మియానో, కరాచీ, ఛోర్, రావల్పిండి, అటక్ తదితర ప్రాంతాల్లో డ్రోన్ దాడులు జరిగిగాయని, వాటిలో కొన్ని డ్రోన్లను కూల్చివేసినట్టు పాక్ ఆర్మీ అధికార ప్రతినిధి లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌద్రీ ధ్రువీకరించారు.