న్యూఢిల్లీ, జనవరి 13: జమ్ము కశ్మీరులోని కేరీ సెక్టార్కు చెందిన దూంగా గలీ ప్రాంతంలో నియంత్రణ రేఖ(ఎల్వోసీ) వెంబడి మంగళవారం అనేక డ్రోన్లు ఎగురుతూ కనిపించడంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. డ్రోన్లను కూల్చివేసేందుకు వాటిపై కాల్పులు జరిపిన భద్రతా దళాలు డ్రోన్ల ద్వారా ఆయుధాల చేరవేత జరిగిందా? అన్న కోణంలో గాలింపు చేపట్టాయి. గడచిన 48 గంటల్లో రాజౌరీ సెక్టార్లో ఇటువంటి సంఘటన జరగడం ఇది రెండవసారి. పెద్ద సంఖ్యలో డ్రోన్ల కదలికలపై ఆందోళన చెందిన సైనిక దళాలు ఎల్వోసీ, అంతర్జాతీయ సరిహద్దు(ఐబీ) వెంబడి విస్తృతంగా తనిఖీలు చేపట్టి నిఘాను పెంచాయి. గత ఏడాది మేలో ఆపరేషన్ సిందూర్ తర్వాత ఎల్వోసీ, ఐబీ వెంబడి పెద్ద సంఖ్యలో డ్రోన్లు సంచరించడం ఇదే మొదటిసారి. ఆదివారం రాజౌరీ సెక్టార్లో అనేక డ్రోన్లు ఎగురుతూ కనిపించాయి.