Road accident : ఛత్తీస్‌గఢ్ (Chattisgarh) లో సినిమాను తలపించే ఘటన చోటుచేసుకుంది. మద్యం మత్తులో ఉన్న ఓ ట్రక్కు డ్రైవర్ 11 ఏళ్ల బాలికను ఢీకొట్టి చంపేశాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించగా.. పోలీసులు దాదాపు 60 కిలోమీటర్ల దూరం వెంటాడి అతడిని అరెస్ట్ చేశారు. ఈ ఛేజింగ్ సుమారు రెండు గంటలపాటు కొనసాగింది. మోహ్లా-మాన్పూర్-అంబాగఢ్ చౌకీ జిల్లా అదనపు ఎస్పీ పీతాంబర్ పటేల్ తెలిపిన వివరాల ప్రకారం.. నిన్న రాజ్‌నంద్‌గావ్-మాన్పూర్ రహదారిపై ఉన్న గుండర్దేహి (Gunder Dehi) గ్రామంలో ఈ దారుణం జరిగింది.
వేగంగా వెళ్తున్న ఓ ట్రక్కు పూనమ్ (11) అనే బాలికను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బాలిక అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. అయితే డ్రైవర్ ట్రక్కును ఆపకుండా పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు మోహ్లా వైపు వేగంగా పారిపోయాడు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. మోహ్లా పోలీస్ స్టేషన్ వెలుపల బ్యారికేడ్లు ఏర్పాటు చేసి ట్రక్కును ఆపేందుకు ప్రయత్నించారు. అయితే డ్రైవర్ అక్కడే ఆగి ఉన్న మరో ట్రక్కును వెనుక నుంచి ఢీకొట్టి, పోలీసు బ్యారికేడ్లను బద్దలు కొట్టుకుని ముందుకు దూసుకెళ్లాడు.
దాంతో పోలీసులు మాన్పూర్లోని సబ్-డివిజనల్ మేజిస్ట్రేట్ కార్యాలయం వద్ద మరోసారి బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. డ్రైవర్ వాటిని కూడా ఢీకొట్టి, బ్యారికేడ్లలోని కొన్ని భాగాలను ఈడ్చుకుంటూ పట్టణంలోకి ప్రవేశించాడు. ఈ సమయంలో పోలీసులు త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. దాదాపు 60 కిలోమీటర్ల ఉత్కంఠభరితమైన ఛేజింగ్ తర్వాత మహారాష్ట్ర సరిహద్దుకు కేవలం ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న కోర్కోట్టి గ్రామ సమీపంలో ట్రక్కు అదుపుతప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లి ఆగింది. ఈ ప్రమాదంలో గాయపడిన డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అతడు మద్యం మత్తులో ఉన్నట్లు గుర్తించి, చికిత్స కోసం మాన్పూర్ ఆసుపత్రికి తరలించారు. మహారాష్ట్ర రిజిస్ట్రేషన్ ఉన్న ఆ ట్రక్కును స్వాధీనం చేసుకున్నారు. ఈ ప్రమాదంతో ఆగ్రహానికి గురైన గుండర్దేహి గ్రామస్థులు, బాలిక మృతదేహంతో రోడ్డుపై బైఠాయించి రెండు గంటలపాటు రాకపోకలను అడ్డుకున్నారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీనియర్ పోలీస్ అధికారులు హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు. పోస్టుమార్టం అనంతరం బాలిక మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. కాగా, పోలీసుల ఛేజింగ్‌కు సంబంధించిన కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.