న్యూఢిల్లీ: ఢిల్లీ పబ్లిక్ స్కూల్ వెనక్కి తగ్గింది. ఫీజు వివాదం నేపథ్యంలో 32 మంది విద్యార్థుల సస్పెన్షన్ను రద్దు చేసింది. ఢిల్లీ హైకోర్టుకు ఈ మేరకు సమాచారం ఇచ్చింది. పెరిగిన ఫీజులు చెల్లించనందుకు 32 మంది విద్యార్థులను ద్వారకలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ సస్పెండ్ చేసింది. (DPS Dwarka) దీంతో ఆయా విద్యార్థుల తల్లిదండ్రులు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఆమోదించని ఫీజులను వసూలు చేస్తున్నారని, గతంలో ఉన్న నెలవారీ ఫీజు రూ.7,000 నుంచి రూ. 9,000కు పెంచారని ఆరోపించారు.
కాగా, పేరెంట్స్ పిటిషన్పై ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి సచిన్ దత్తా తీర్పును ప్రకటించనున్న తరుణంలో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ వెనక్కి తగ్గింది. ‘విద్యార్థులను తొలగించిన సస్పెన్షన్ ఉత్తర్వును మేం ఉపసంహరించుకున్నాం. సోమవారం ఆ మేరకు అఫిడవిట్ కూడా దాఖలు చేశాం’ అని స్కూల్ తరపు న్యాయవాది కోర్టుకు తెలియజేశారు.
మరోవైపు స్కూల్ జాబితా నుంచి తొలగించిన 32 మంది విద్యార్థులను వెంటనే తిరిగి చేర్చుకోవాలని ద్వారకా ఢిల్లీ పబ్లిక్ స్కూల్కు విద్యా శాఖ డైరెక్టరేట్ ఆదేశాలు జారీ చేసింది. స్కూల్ చర్యలు కోర్టు ఆదేశాలను ఉల్లంఘించాయని, విద్యా శాఖ అనుమతి లేకుండా ఫీజు పెంపు నిషేధమని, ఫీజు సమస్యల పరంగా విద్యార్థులపై ఎలాంటి వివక్ష చూపకూడదని ఆ ఉత్తర్వులో పేర్కొంది.
Also Read: