ఢిల్లీ: రోడ్లపై పోకిరీలు ఇష్టారీతిన వాహనాలు నడుపుతూ ఇతరులకు ఇబ్బందులకు గురిచేస్తున్నారు. బైకులపై వేగంగా వెళ్తూ, స్టంట్లు చేస్తూ (Bike Stunts) తోటి వాహనదారులు ప్రమాదాల బారిన పడేలా చేస్తున్నారు. ఇతర వాహనాలకు అడ్డంగా నడుపుతూ రాక్షసానందం పొందుతున్నారు. ఇలాంటి ఘటనే ఢిల్లీలో జరిగింది. ఈస్ట్ ఢిల్లీలోని మయూర్ విహార్‌లో ఢిల్లీ ట్రాన్స్‌పోర్టు బస్సు వెళ్తున్నది. రాయల్ ఎన్ఫీల్డ్ బైక్‌తో బస్సు ముందుకు వచ్చిన ఓ యువకుడు.. కట్లు కొడుతూ దానిని అడ్డగించాడు. రోడ్డుకు అటూ ఇటూ బైక్ నడుపుతూ బస్సు తనను ఓవర్ చేయకుండా అడ్డుకున్నాడు. కొద్దిసేపటి తర్వాత బస్సు డ్రైవర్ వద్ద ఉండే సైడ్ మిర్రన్ పట్టుకునేందుకు ప్రయత్నించాడు. దీనిని తన ఫోన్లో బంధించిన ఓ వ్యక్తి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఇది ఎక్కడో చెప్పండంటూ రాసుకొచ్చాడు..
అది కాస్తా పోలీసుల దృష్టికి వెళ్లడంతో రంగంలోకి దిగారు. వీడియోలోని బైక్ నంబర్ ఆధారంగా యజమానికి గుర్తించారు. అతనిడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా తాను ఆ బైక్‌ను 13 ఏండ్ల క్రితమే మరొకరికి అమ్మేశానని చెప్పాడు. అయినా ఇప్పటికీ అతనిపేరుతో రిజిస్ట్రేషన్ కాలేదని వెల్లడించారు. కాగా, ఆ బైక్ జీవిత కాలం 15 ఏండ్లు పూర్తిఅయినట్లు పోలీసులు గుర్తించారు. దానిని స్క్రాబ్‌కు తరలించాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా ప్రమాదకరంగా స్టంట్లు చేయవద్దని, కోరి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని, రహదారి భద్రత నియమాలు పాటించాలని బైకర్లను కోరారు.