న్యూఢిల్లీ: తాత్కాల్ టికెట్ల(Tatkal Tickets) జారీలో జరుగుతున్న అవకతవకలను అడ్డుకునేందుకు భారతీయ రైల్వే కొత్త నిర్ణయం తీసుకున్నది. తాత్కాల్ టికెట్లు పొందేందుకు ఈ-ఆధార్ తప్పనిసరి చేస్తున్నట్లు రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ఆయన తన ఎక్స్ అకౌంట్లో ఈ విషయాన్ని చెప్పారు. త్వరలోనే ఈ-ఆధార్ ఆధారంగా తాత్కాల్ టికెట్లు పొందే ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. అవసరమైన సమయంలో నిజమైన యూజర్లకు కన్ఫర్మ్ టికెట్లు దక్కాలన్న ఉద్దేశంతో ఈ-ఆధార్‌ను తాత్కాల్ టికెట్లకు తప్పనిసరి చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు.
ఐఆర్సీటీసీ పోర్టల్ ద్వారా జరుగుతున్న టికెట్ల బుకింగ్ అక్రమాలను అడ్డుకునే ప్రయత్నంలో భాగంగా సుమారు 2.5 కోట్ల బోగస్ ఐడీలను బ్లాక్ చేసినట్లు రైల్వే శాఖ చెప్పింది. ఏఐ ఆధారిత వ్యవస్థ ద్వారా ఆ ఐడీలను డీయాక్టివేట్ చేసినట్లు రైల్వే శాఖ పేర్కొన్నది. మే 22వ తేదీన ఒక నిమిషంలో అత్యధిక సంఖ్యలో టికెట్లు బుక్ అయ్యాయని, ఆ రోజున కేవలం 60 సెకన్లలో 31,814 టికెట్లు బుక్ అయినట్లు రైల్వే శాఖ చెప్పింది. ఆపరేషనల్ సామర్థ్యంలో ఇదో కొత్త మైలురాయిని రైల్వే శాఖ తెలిపింది.
తాత్కాల్ బుకింగ్ సమయంలో.. మొదటి 5 నిమిషాల్లో ట్రాఫిక్ తారాస్థాయిలో ఉంటుందని, అయితే కొత్త బాట్ సిస్టమ్ ద్వారా ఆ ట్రాఫిక్‌ను రెగ్యులేట్ చేసినట్లు రైల్వే శాఖ పేర్కొన్నది. టికెట్ బుకింగ్ సామర్థ్యాన్ని పెంచేందుకు కొత్త యూజర్ ప్రోటోకాల్స్‌ను ఇంట్రడ్యూస్ చేసినట్లు రైల్వే శాఖ తెలిపింది. ఆధార్ వెరిఫికేషన్ లేని యూజర్లు.. రిజిస్ట్రేషన్ తర్వాత మూడు రోజులకు టికెట్లు బుక్ చేసుకోవచ్చు. ఇక ఈ-ఆధార్ వెరిఫై యూజర్ ఎటువంటి జాప్యం లేకుండా టికెట్‌ను పొందవచ్చు అని రైల్వే శాఖ చెప్పింది.
Bharatiya Railways will soon start using e-Aadhaar authentication to book Tatkal tickets.
This will help genuine users get confirmed tickets during need.
— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) June 4, 2025