UP Murder : ఉత్తర ప్రదేశ్‌లోని బులంద్షర్ ప్రాంతంలో దారుణం జరిగింది. తన భార్య మీద అనుమానంతో ఆమెను, కన్న తండ్రిని కాల్చి చంపాడో కిరాతకుడు. ఈ ఘటన బులంద్షర్ ప్రాంతం, కలాందర్గార్హి అనే గ్రామంలో ఆదివారం జరిగింది. మృతురాలు రెండు వారాల క్రితమే బాబుకు జన్మనిచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కలాందర్గార్హి గ్రామానికి చెందిన మోమిన్ ఖాన్ అలీగఢ్‌లో మెడికల్ స్టోర్ నిర్వహిస్తున్నాడు. అతడికి ఏడాది క్రితం సనా (24) అనే మహిళతో వివాహం జరిగింది. రెండు వారాలక్రితం సనా.. ఒక బాబుకు జన్మనిచ్చింది.
అయితే, ఆ బాబు తన కొడుకు కాదని మోమిన్ ఖాన్‌కు అనుమానం కలిగింది. ఈ విషయంలో తన తండ్రి మొహమ్మద్ రియాజుద్దీన్ (50)నే అనుమానించాడు. తన తండ్రికి, భార్యకు వివాహేతర సంబంధం ఉందని భావించాడు. ఈ క్రమంలో తన తండ్రికి సంబంధించిన లైసెన్సుడ్ గన్‌తో ఇద్దరినీ కాల్చాడు. ఈ ఘటనలో రియాజుద్దీన్ ఘటనా స్థలంలోనే మరణించాడు. తీవ్ర రక్త స్రావం కారణంగా అతడు ప్రాణాలు కోల్పోయాడు. అయితే, సనా మాత్రం గాయాలపాలైంది. ఆమెను వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందించారు. కానీ, అక్కడ చికిత్స పొందుతూ సనా కూడా ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన తర్వాత నిందితుడు మోమిన్ ఖాన్ అక్కడ్నుంచి పారిపోయాడు.
మోమిన్ ఖాన్‌కు, తన భార్యకు మధ్య సంబంధం ఉందని అతడు చాలా కాలం నుంచి అనుమానిస్తున్నాడు. ఈ క్రమంలో ఆదివారం ఇంట్లో గొడవ జరిగింది. అయితే, సనా కుటుంబ సభ్యులు వచ్చి, నచ్చజెప్పి వెళ్లారు. వారు వెళ్లిన కొద్దిసేపటికే మోమిన్ ఖాన్ తండ్రిపై, భార్యపై కాల్పులు జరిపాడు. ఘటనపై కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు మోమిన్ ఖాన్‌ను అరెస్టు చేశారు. ఈ సందర్భంగా అతడిని విచారించగా తన తండ్రికి, భార్యకు మధ్య కొన్ని అనుమానిత, అసభ్యకర చాట్స్, ఫొటోలు చూసినట్లు, అందువల్లే తను ఈ పని చేసినట్లు వెల్లడించాడు.