భోపాల్: మధ్యప్రదేశ్‌లోని బీజేపీ ప్రభుత్వం ఆవులకు ఇచ్చే భత్యాన్ని రెట్టింపు చేసింది. (Double Allowance For Cows) ఆ రాష్ట్ర బడ్జెట్లో ఈ మేరకు ప్రకటించింది. గోశాలల్లో ఉన్న ఆవులకు రోజు వారీ గ్రాంట్‌ను రూ.20 నుంచి రూ. 40కు పెంచుతున్నట్లు ఆర్థిక మంత్రి జగదీష్ దేవ్డా తెలిపారు. గో సంరక్షణ పథకానికి రూ.505 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. మరింత స్వయం సమృద్ధిగల గోశాలలను ఏర్పాటు చేస్తామని బడ్జెట్లో పేర్కొన్నారు.
కాగా, మధ్యప్రదేశ్‌లోని సుమారు 2,400కు పైగా గోశాలలున్నాయి. ప్రభుత్వం నిర్మించిన 1,800 గోశాలల్లో సుమారు 2.8 లక్షల ఆవులు, ప్రైవేటుగా నిర్వహించే 618 గోశాలల్లో సుమారు 1.5 లక్షల ఆవులకు ఆశ్రయం కల్పించారు. ఆవుల కోసం ప్రత్యేకంగా గో క్యాబినెట్, గో సంవర్ధన్ బోర్డు కూడా ఉన్నాయి.
మరోవైపు వాస్తవ పరిస్థితులు మరోలా ఉన్నాయి. ఒక్కో ఆవుకు పశుగ్రాసం కోసం సుమారు వంద వరకు ఖర్చు చేస్తున్నారు. ఆరోగ్య సంరక్షణ, ఇతర వ్యయాలు అదనం. ఈ నేపథ్యంలో ఆవులకు ఇచ్చే రోజువారీ భత్యాన్ని రూ.20 నుంచి రూ.40కు ప్రభుత్వం రెట్టింపు చేసినప్పటికీ ఏ మాత్రం సరిపోదని గోశాల నిర్వాహకులు వాపోతున్నారు. అలాగే ఆవు భత్యం గ్రాంట్లు ఐదారు నెలలు ఆలస్యంగా ప్రభుత్వం చెల్లిస్తున్నట్లు ఆరోపించారు. దీంతో ఆవుల పెంపకం భారమంతా తమపైనే పడుతున్నదని గోశాల నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేశారు.