మైసూరు: సనాతనులతో కలిసి తిరగొద్దని, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్), సంఘ్ పరివార్‌లతో జాగ్రత్తగా ఉండాలని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రజలను హెచ్చరించారు. వీరు బీఆర్ అంబేద్కర్‌ను, ఆయన రాసిన రాజ్యాంగాన్ని చారిత్రకంగా వ్యతిరేకించారని చెప్పారు. మైసూరు విశ్వవిద్యాలయం రజతోత్సవాల ప్రారంభం సందర్భంగా శనివారం ఆయన మాట్లాడారు. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్‌పై ఓ సనాతనుడు చెప్పు విసిరాడని, దీనినిబట్టి సనాతనులు, సంప్రదాయ శక్తులు ఇంకా సమాజంలో ఉన్నాయని వెల్లడవుతున్నదని తెలిపారు.
ఈ చర్యను దళితులు మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరూ ఖండించాలన్నారు. ఆరెస్సెస్, సంఘ్ పరివార్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని గతంలో వ్యతిరేకించాయని, ఇప్పటికీ వ్యతిరేకిస్తున్నాయని తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. సమాజాన్ని అర్థం చేసుకోవడానికి అంబేద్కర్ విజ్ఞానాన్ని సంపాదించారన్నారు. బీజేపీ, సంఘ్ పరివార్ అంబేద్కర్ పేరుతో తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆయన తీవ్రంగా విమర్శించారు.
ఆరెస్సెస్ శతాబ్ది ఉత్సవాలకు హాజరైన ఓ అధికారిపై కర్ణాటక ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. దీనిపై బీజేపీ స్పందిస్తూ, ఇది హిందూ వ్యతిరేక, వక్ర బుద్ధి గల ఆలోచన ధోరణి అని కాంగ్రెస్‌పై మండిపడింది. రాయ్‌చూర్ జిల్లా, సిర్వార్ తాలూకా పంచాయతీ అభివృద్ధి అధికారి ప్రవీణ్ కుమార్ కేపీ ఈ నెల 12న ఆరెస్సెస్ శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఆరెస్సెస్ యూనిఫాం ధరించి, కర్ర పట్టుకుని కవాతులో పాల్గొన్నారు. దీంతో ఆయనను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. సివిల్ సర్వీస్ ప్రవర్తన నియామవళి ప్రకారం రాజకీయంగా తటస్థ వైఖరి, క్రమశిక్షణ అవసరమని, ఇది ఉల్లంఘించినందుకు ప్రవీణ్ కుమార్‌ను సస్పెండ్ చేస్తున్నట్లు ఈ ఆదేశాల్లో పేర్కొంది.
బెళగావి: కర్ణాటకలో ఆరెస్సెస్‌ను నిషేధించాలన్న ప్రతిపాదనేదీ రాష్ట్ర ప్రభుత్వం వద్ద లేదని రాష్ట్ర న్యాయ శాఖ మంత్రి హెచ్‌కే పాటిల్ శనివారం వెల్లడించారు. రాష్ట్రంలో ఏ సంస్థనూ నిషేధించే ఆలోచన ప్రభుత్వానికి లేదని ఆయన స్పష్టం చేశారు. ఆరెస్సెస్ నమోదు కాని సంస్థ కాబట్టి దాన్ని నిషేధించాలంటూ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు బీకే హరిప్రసాద్ తదితర నాయకులు చేసిన వ్యాఖ్యలకు తాను జవాబు ఇవ్వలేనని విలేకరులతో మాట్లాడుతూ పాటిల్ చెప్పారు. ప్రస్తుతం ఆర్ఎస్ఎస్ని నిషేధించే ప్రతిపాదనేదీ ప్రభుత్వం వద్ద లేదని ఆయన చెప్పారు.