Donald Trump : అగ్రరాజ్యం అమెరికా (USA), ఇరాన్ (Iran) మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యాయి. ప్రపంచ చమురు రవాణాలో అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధి (Strait of Hormuz) ని ‘అమెరికా కొత్త భూభాగం’ గా అభివర్ణిస్తూ అమెరికా అధ్యక్షుడు (US President) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) సంచలన ప్రకటన చేశారు. ఈ మేరకు హర్మూజ్ జలసంధిని అమెరికా భూభాగంగా చూపిస్తున్న ఒక మ్యాప్‌ను ఆయన తన ట్రూత్ సోషల్ ఖాతాలో ఆదివారం మరోసారి పోస్ట్ చేశారు. ఇరాన్‌పై కఠినమైన ఆంక్షలు విధించేందుకు అమెరికా సిద్ధమవుతున్న తరుణంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
గతంలోనూ ట్రంప్ ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. సౌత్ కరోలినాలో జరిగిన ఓ ర్యాలీలో మాట్లాడుతూ.. ‘నేను హర్మూజ్ జలసంధిని ప్రస్తుతం అమెరికా భూభాగంగానే చూస్తున్నా అని స్పష్టం చేశారు. ఇరాన్ నౌకలు, ఓడరేవులపై అమెరికా నావికాదళం దిగ్బంధనం కొనసాగిస్తున్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ జలమార్గం గుండా రాకపోకలను అమెరికాయే నియంత్రిస్తోందని, దీనిని అధికారికంగా అమెరికా భూభాగంగా ప్రకటించే ఆలోచనను కూడా ఆయన గతంలో ప్రస్తావించారు. ప్రపంచంలోని ఐదో వంతు సముద్ర చమురు రవాణా ఈ మార్గం గుండానే జరుగుతుంది.