న్యూఢిల్లీ, నవంబర్ 10: భారతీయ వస్తువులపై భారీ సుంకాలు విధించిన అమెరికా ప్రభుత్వం పాకిస్థాన్‌పై ఉదారంగా వ్యవహరిస్తూ తక్కువ సుంకాలు విధించిందని భారత రిజర్వ్ బ్యాంకు(ఆర్బీఐ) మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య స్నేహ బంధాన్ని ప్రశ్నించిన రాజన్.. ఈ ఇద్దరు నాయకుల మధ్య ఉండాల్సిన బంధానికి భిన్నంగా అమెరికా వాణిజ్య చర్యలు ఉన్నాయని వ్యాఖ్యానించారు. ప్రపంచ వ్యవహారాలపై షికాగో కౌన్సిల్ ఈ నెల 6న నిర్వహించిన ఓ సమావేశంలో రాజన్ ప్రసంగిస్తూ భారతీయ వస్తువులపై 50 శాతం సుంకాలు విధించిన అమెరికా.. పాక్‌పై కేవలం 19 శాతం సుంకాలను మాత్రమే విధించినపుడు ట్రంప్, మోదీ మధ్య గొప్పగా చెప్పుకున్న స్నేహబంధం ఎక్కడకు పోయిందని ప్రశ్నించారు. అమెరికా చర్యలతో భారత్ తీవ్ర నిరాశకు గురయ్యిందని, ఈ చర్యతో అమెరికాను నమ్మకూడదని తేలిపోయిందని ఆయన స్పష్టం చేశారు.
అమెరికా చేపట్టిన చర్యలపై ప్రజలలో అనేక అనుమానాలు ఉన్నాయని ఆయన తెలిపారు. అమెరికాను విశ్వసించలేమని పునరుద్ఘాటించిన రాజన్ 1970వ దశకంలో అప్పటి అమెరికా అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్, మాజీ విదేశాంగ మంత్రి హెన్రీ కిస్సింజర్ 1971 నాటి భారత్-పాక్ యుద్ధంలో అమెరికాను పాకిస్థాన్‌కు అనుకూలంగా మార్చివేశారని ఆయన గుర్తు చేశారు. పాక్‌కు అండగా నిలిచి యుద్ధాన్ని ఆపేందుకు అమెరికా తన నౌకాదళ బలగాన్ని(సెవెన్త్ ఫ్లీట్) పంపిందని, ఇది భారతీయులను ఆగ్రహానికి గురిచేసిందని, ఆ సమయంలో సోవియట్ యూనియన్ భారత్‌కు సాయపడడంతో ఆ తర్వాత 25 ఏళ్లపాటు సోవియట్ శిబిరంలోనే భారత్ ఉండిపోయిందని రాజన్ వివరించారు. అమెరికా మైత్రి నుంచి బయటపడేందుకు భారత్‌కు చాలా కాలం పట్టిందని ఆయన తెలిపారు.
చైనాతో ఉన్న ప్రస్తుత సంబంధాల దృష్ట్యా ఆ దేశంపై ఆధారపడడం భారత్‌కు మంచిది కాదని ఆయన సూచించారు. జపాన్, ఆస్ట్రేలియా, ఇతర క్వాడ్ దేశాలతో సత్సంబంధాలను భారత్ కొనసాగిస్తున్నప్పటికీ అమెరికాతో స్నేహబంధం మాత్రం చాలా నిరాశను కలిగించడంతోపాటు ఇచ్చి పుచ్చుకునే రీతిలో లేదని రాజన్ వ్యాఖ్యానించారు. అమెరికా విధించిన 50 శాతం సుంకాలు భారత్‌లోని పరిశ్రమలపై వేర్వేరుగా ప్రభావం చూపుతాయని ఆయన చెప్పారు. యాపిల్ వంటి కంపెనీలు అమెరికా ప్రభుత్వానికి నచ్చచెప్పి సుంకాలను మాఫీ చేయించుకోగలవని, కాని చిన్న కంపెనీలకు తమ ఉత్పత్తులను అమెరికాలో విక్రయించుకోవడం అసాధ్యమని ఆయన అభిప్రాయపడ్డారు.
గత 20 ఏళ్లుగా అమెరికాకు దగ్గరవుతున్న భారత్‌కు తీవ్ర నిరాశ ఎదురయ్యిందని, తాను నాయకత్వం గురించి మాట్లాడడం లేదని, సుంకాల వల్ల నష్టపోయే ప్రజల గురించి తాను మాట్లాడుతున్నానని రాజన్ చెప్పారు. పుండు మీద కారం చల్లడం తన ఉద్దేశం కాదని, కాని భారత్‌పై 50 శాతం సుంకాలు విధించి పాక్‌పై 19 శాతం సుంకాలు మాత్రమే విధిస్తే గొప్పగా చెప్పుకున్న మోదీ, ట్రంప్ మధ్య స్నేహం ఎక్కడ ఉందని ఆయన ప్రశ్నించారు. మీ స్నేహబంధం ఎక్కడకు పోయిందని భారతీయ విపక్షాలు ప్రశ్నించడం మోదీకి చెంపపెట్టులాంటిది అని రాజన్ విమర్శించారు. సైనిక మైత్రీబంధం, సంయుక్త ఒప్పందాలు వంటి వాటి గురించి అమెరికా ఒక పక్క మాటలు కొనసాగిస్తూ మరో పక్క చైనా కన్నా అధికంగా ప్రపంచంలోనే అత్యధిక సుంకాలను భారత్ మోయడం తగదని ఆయన అభిప్రాయపడ్డారు.