PM Modi : ఇరాన్‌తో యుద్ధం జరుగుతున్న వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. భారత ప్రధాని నరేంద్ర మోదీకి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫోన్ చేశారు. ఇరాన్ యుద్ధం సహా పశ్చిమాసియా పరిస్థితులు, హార్ముజ్ జలసంధి వంటి అంశాలపై చర్చలు జరిపారు. ఈ విషయాన్ని మంగళవారం ఇటు ప్రధాని మోదీ తన ఎక్స్ ఖాతాలో పేర్కొనగా, అటు అమెరికా తరఫున ఇండియాలో అమెరికా రాయబారి సెర్గియో గోర్ వెల్లడించారు.
ప్రస్తుత పరిస్థితుల్లో హార్ముజ్ జలసంధిని తెరవడం చాలా అవసరమని ఇరువురు నేతలు అభిప్రాయపడ్డారు. ట్రంప్‌తో చర్చలపై మోదీ తన ఎక్స్ ఖాతాలో వెల్లడించారు. ట్రంప్ నుంచి కాల్ అందుకున్నట్లు, పశ్చిమాసియా ఉద్రిక్తతలపై చర్చించినట్లు తెలిపారు. ఉద్రిక్తతలు తగ్గించేందుకు, శాంతి స్థాపనకు ఇండియా ఎప్పుడూ మద్దతుగా ఉంటుందని మోదీ అభిప్రాయపడ్డారు. అలాగే, హార్ముజ్ జలసంధిని తెరిచి, ప్రపంచ అవసరాలకు అనుగుణంగా అందుబాటులో ఉంచడం అవసరమని పేర్కొన్నారు. ఈ అంశంలో స్థిరత్వం, శాంతికి ఎప్పుడూ అందుబాటులో ఉంటామని ట్రంప్‌నకు మోదీ తెలిపారు. హార్ముజ్ జలసంధిలో అడ్డగింత అంగీకరించదగింది కాదని మోదీ అంతకుముందు పార్లమెంట్లో అన్నారు.
వాణిజ్య నౌకలపై దాడి చేయడం సరికాదన్నారు. చర్చలు, దౌత్య మార్గాల ద్వారా భారత నౌకల్ని సురక్షితంగా తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. ఇరాన్‌పై ఐదు రోజులపాటు దాడులు ఆపేస్తామని ట్రంప్ పేర్కొన్న మరుసటి రోజే ప్రధాని మోదీకి ఫోన్ చేయడం విశేషం.