న్యూఢిల్లీ: ఆకర్షణీయమైన ఉద్యోగాల కోసం ఎదురుచూస్తూ అమెరికాలో ఉంటున్న భారతీయ విద్యార్థుల పరిస్థితి త్రిశంకు స్వర్గంలో ఉన్నట్లుగా మారింది. వీసా స్పాన్సర్షిప్ అవసరమని కంపెనీలు వారిని ఆటోమెటిక్‌గా రిజెక్ట్ చేస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్-1బీ వీసా ఫీజును 1 లక్ష డాలర్లకు పెంచడంతో, కంపెనీలు వీరి దరఖాస్తులను మొదట్లోనే తిరస్కరిస్తున్నాయి. కొందరు ఓవర్సీస్ గ్రాడ్యుయేట్లకు, కొన్ని రకాల స్టూడెంట్ వీసాలు ఉన్న వారికి మినహాయింపు ఇస్తున్నట్లు వైట్ హౌస్ ప్రకటించింది. కానీ ఆ తర్వాత జారీ అవుతున్న మార్గదర్శకాలు వీసా స్పాన్సర్షిప్ ఖర్చులు, విధానాల విషయంలో కంపెనీలను అనిశ్చితిలోకి నెట్టుతున్నాయి.
మన దేశం నుంచి నాలుగేళ్ల క్రితం ఎన్నో ఆశలతో అమెరికాకు వెళ్లిన ఇషాన్ చౌహాన్ మాట్లాడుతూ, విస్కాన్సిన్-మేడిసన్ విశ్వవిద్యాలయంలో కంప్యూటర్, డాటా సైన్స్ చదివితే, ఉద్యోగావకాశాలు వస్తాయని భావించానన్నారు. మే నెలలో గ్రాడ్యుయేషన్ పూర్తవడానికి ముందు తాను ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసినపుడు, కంపెనీలు తనను ఇంటర్వ్యూ చేయడానికి సైతం తిరస్కరించాయని చెప్పారు. తనకు వీసా స్పాన్సర్షిప్ అవసరమని తెలుసుకుని ఈ విధంగా వ్యవహరించాయన్నారు.
అత్యుత్తమ విశ్వవిద్యాలయంలో చదివినా, అత్యుత్తమ ఇంటర్న్షిప్స్ చేసినా ప్రయోజనం ఉండటం లేదని తెలిపారు. “నీకు ఇప్పుడు లేదా భవిష్యత్తులో స్పాన్సర్షిప్ అవసరమవుతుందా?” అనేదొక్కటే ప్రశ్న అని చెప్పారు. నాన్-యూఎస్ సిటిజన్‌షిప్ స్టేటస్ ఉన్న వారికి ఉద్యోగాలు ఇవ్వడానికి కంపెనీలు తిరస్కరిస్తున్నాయి. హెచ్-1బీ వీసా అవసరమైన వారికి ఉద్యోగాలివ్వరాదని అమెరికాలోని అతి పెద్ద ప్రైవేట్ ఎంప్లాయర్ వాల్‌మార్ట్ నిర్ణయించింది.
ప్రస్తుతం అమెరికన్ విశ్వవిద్యాలయాల్లో సుమారు 11 లక్షల మంది విదేశీ విద్యార్థులు ఉన్నట్లు ఓ నివేదిక తెలిపింది. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వలస విధానాలను కఠినతరం చేయడంతో వర్క్ వీసాలను స్పాన్సర్ చేయడంపై కంపెనీలకు ఆసక్తి సన్నగిల్లింది. వీసా స్పాన్సర్‌షిప్‌ను ఆఫర్ చేసే పూర్తి కాలపు ఉద్యోగాల నిష్పత్తి 2023 నుంచి 2025 నాటికి 10.9 శాతం నుంచి 1.9 శాతానికి తగ్గిందని మరో నివేదిక వెల్లడించింది.
ముఖ్యంగా టెక్నాలజీ రంగంలో భారీ తగ్గుదల కనిపించింది. నిరుటి కన్నా మూడో వంతుకు క్షీణించింది. ప్రస్తుతం అమెరికాలో ప్రొఫెషనల్ రోల్స్ విషయంలో స్థానిక అమెరికన్లకు సైతం సవాళ్లు ఎదురవుతున్నాయి. టెక్నాలజీ సహా వైట్ కాలర్ జాబ్ సెక్టర్స్‌లో నియామకాల ప్రక్రియ తీవ్రంగా మందగించింది. కృత్రిమ మేధ (ఏఐ) సంబంధిత పరిణామాలు జూనియర్ స్థాయి ఉద్యోగాలను తగ్గించాయి.
అమెరికా ఆర్థిక వ్యవస్థకు నికర సకారాత్మక కృషి చేస్తున్న వలసదారుల్లో భారతీయులే అత్యధికమని మన్హటన్ ఇన్స్టిట్యూట్ పరిశోధకుడు డేనియల్ డీ మార్టినో నిర్వహించిన అధ్యయనం వెల్లడించింది. ప్రతి ఇండియన్ ఇమిగ్రెంట్ మూడు దశాబ్దాలకు పైగా అమెరికా జాతీయ రుణంలో సగటున 1.6 మిలియన్ డాలర్లు తగ్గిస్తున్నట్లు ఈ నివేదిక తెలిపింది. అన్ని రకాల వలసదారుల సమూహాల్లో భారతీయులే అత్యధికంగా అమెరికన్ జీడీపీకి తోడ్పడుతున్నట్లు పేర్కొంది.