CJI Chandrachud | న్యూఢిల్లీ, అక్టోబర్ 27: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో న్యాయవ్యవస్థకు పాలనాపరమైన సంబంధాలు ఉంటాయని, వీటిపై మాట్లాడుకునేందుకు ప్రభుత్వ పెద్దలతో సీజేఐ, హైకోర్టు చీఫ్ జస్టిస్‌లు సమావేశమవుతారని భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) డీవై చంద్రచూడ్ అన్నారు. ప్రభుత్వ పెద్దలను కలిస్తే.. ఇద్దరి మధ్యా ఏదో డీల్ కుదిరినట్టు భావించరాదని స్పష్టం చేశారు. మనదేశంలో న్యాయ వ్యవస్థ స్వతంత్రంగా వ్యవహరిస్తున్నదని ఆయన స్పష్టం చేశారు.
‘న్యాయవ్యవస్థకు కావాల్సిన నిధులను (బడ్జెట్) ప్రభుత్వాలు విడుదల చేస్తాయి కాబట్టే సీఎంలతో సమావేశాలు తప్పనిసరి. కేవలం లేఖలు పంపి ఊరుకుంటే పనులు కావు. న్యాయమూర్తులు నేరుగా మాట్లాడాల్సి ఉంటుంది. జడ్జిలతో జరిగిన సమావేశంలో ఏ సీఎం కూడా పెండింగ్ కేసుల ప్రస్తావన తేలేదు. జడ్జీలతో జరిగే మీటింగ్స్‌లో రాజకీయ వ్యవస్థ చాలా పరిపక్వతతో వ్యవహరించింది’ అని చెప్పారు. కొద్ది రోజుల క్రితం సీజేఐ ఇంట జరిగిన ఓ పూజా కార్యక్రమానికి ప్రధాని మోదీ హాజరుకావటాన్ని విపక్షాలు ప్రశ్నించాయి. న్యాయవ్యవస్థ పట్ల విశ్వసనీయతను దెబ్బతీస్తుందని శివసేన (యుబీటీ) నాయకుడు సంజయ్ రౌత్ ఆందోళన వ్యక్తం చేశారు.