NMC | న్యూఢిల్లీ, జనవరి 19: వైద్య సంస్థల్లో అధ్యాపక పోస్టుల్లో నియామకానికి సంబంధించిన అర్హతలపై జాతీయ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) ఈ నెల 17న విడుదల చేసిన కొత్త ముసాయిదాపై వైద్యులు, వైద్య విద్యార్థులు మండిపడుతున్నారు. దీనిపై తీవ్ర అభ్యంతరాలు చెబుతున్నారు. కొత్త ముసాయిదా ప్రకారం వైద్యేతర రంగ అధ్యాపకులు కూడా సీనియర్ రెసిడెంట్, అసిస్టెంట్ ప్రొఫెసర్లతో పాటు అనాటమీ (శరీర నిర్మాణ శాస్త్రం), బయోకెమెస్ట్రీ (జీవ రసాయన శాస్త్రం), ఫిజియాలజీ (శరీర ధర్మ శాస్త్రం) సబ్జెక్టులలో ఉన్నత పదవులకు అర్హులవుతారు.
పైన పేర్కొన్న సబ్జెక్టులలో అర్హులైన అధ్యాపకులు లభించకపోతే ఆయా సబ్జెక్టులలో ఎంఎస్సీ, పీహెచ్డీ చేసి, సంబంధిత రంగాలలో శిక్షణ, అనుభవం ఉన్న వారిని పరిమిత కాలం పాటు అధ్యాపకులుగా నియమించవచ్చునని ఎంఎన్సీ తన కొత్త ముసాయిదాలో పేర్కొంది.
అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా వైద్యేతర సిబ్బందిని నియమించాలనుకోవడం వైద్య విద్య నాణ్యతను దిగజార్చడమేనని మెడికల్ డాక్టర్లు పేర్కొంటూ దేశ వ్యాప్త ఆందోళనకు దిగారు. ప్రైవేట్ వైద్య కళాశాలలు దీనిని దుర్వినియోగానికి వాడుకుంటాయని, తద్వారా నాణ్యత గల బోధనా సిబ్బంది కరవవుతారని యునైటెడ్ డాక్టర్స్ ఫ్రంట్ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్య మిట్టల్ ఆరోపించారు. ఈ పోస్టుల్లో వైద్యేతర సిబ్బందిని ఎట్టి పరిస్థితుల్లో నియమించరాదని డిమాండ్ చేశారు.