Mumbai | “మిల్తా హై యహా సబ్‌కుచ్ ఏక్ మిల్తా నహీ దిల్..’- ముంబయిలో అన్నీ దొరుకుతాయి కానీ, స్వచ్ఛమైన మనసు దొరకద’ని హిందీ సినీకవి మజ్రూహ్ సుల్తాన్‌పురీ ఆవేదన! ఈ గీత రచయిత ముంబయిలో ఉండగా బాంద్రా సరస్సు పరిసరాలవైపు ఎప్పుడూ వెళ్లి ఉండకపోవచ్చు! ఒక్కసారైనా వెళ్లి ఉంటే.. ఏ మనసునైనా మైమరపింపజేసే స్వచ్ఛమైన నాగౌరీ చాయ్ తాగకుండా ఉండేవాడు కాదు, తాగితే పై పంక్తులు రాసేవాడూ కాదు! ఈ తరహా చాయ్ ఒకటుందని ముంబైకర్లకు మినహా చాలామందికి తెలియదు. హైదరాబాదీలకు ఇరానీ చాయ్ ఎంత ప్రముఖమైనదో, ముంబయిలో నాగౌరీ చాయ్ అంత విశిష్టమైనది. ఈ చాయ్ వెనుక ఓ హిస్టరీ ఉంది.
దీనికా పేరు దాన్ని కాచి వడకట్టిన నాగౌరీ జాతీయుల కారణంగా వచ్చింది. వీళ్ల మూలాలు రాజస్థాన్‌లోని నాగౌర్ ప్రాంతంలో కనిపిస్తాయి. వీళ్ల పూర్వికులు రాజపుత్రులుగా చెబుతారు. తర్వాతి కాలంలో ముస్లిం రాజుల దండయాత్రలతో వీరిలో కొందరు ఇస్లాం మతం స్వీకరించారు. ప్రధాన వృత్తి గ్రానైట్ ఎగుమతి. ప్రవృత్తి ఆవు పాల విక్రయం. కాలక్రమంలో వ్యాపార అవకాశాలు తగ్గుముఖం పట్టడంతో చాలామంది నాగౌరీలు ముంబయి, బెంగళూరు, ఢిల్లీ, పాకిస్థాన్‌లోని సింధ్ ప్రాంతానికి వలస వెళ్లారు. ముంబయికి వచ్చిన నాగౌరీలు ఇక్కడ దశాబ్దాలుగా చాయ్‌తో తమ సత్తా చాటుతున్నారు. స్వచ్ఛమైన ఆవుపాల టీతో మరాఠీల మనసులు గెలుచుకున్నారు. దక్షిణ ముంబయిలో నాగౌరీ టీ దుకాణాలు అధికంగా కనిపిస్తాయి. దాంతోపాటు బాంద్రా తలాబ్ నుంచి బాంద్రా రైల్వేస్టేషన్ మార్గంలో నాగౌరీ టీ పరిమళం పాదచారులను వెనక్కి పిలుస్తుంటుంది. ఈ దుకాణాల్లో వేడివేడి పకోడీలు, ఆవుపాల కోవాతో చేసిన గులాబ్జామూన్లు, రసగుల్లాలు చవులూరిస్తుంటాయి. ఈసారి ముంబయికి వెళ్లినప్పుడు నాగౌరీ టీ రుచి చూడండి.. ‘ముంబయిలో వింతే.. ముంబయిలో వింతే’ అనకుండా ఉండలేరు!
కావలసినవి: ఆవుపాలు: ఒక కప్పు, నీళ్లు: ఒక కప్పు, టీ పొడి: రెండు టీ స్పూన్లు, చక్కెర: ఒకటిన్నర టేబుల్ స్పూన్ (రెండు కూడా వేసుకోవచ్చు)
తయారీ: రెగ్యులర్ చాయ్లానే దీన్నీ చేసుకోవచ్చు. గేదె పాలకు బదులు ఆవుపాలు వాడతారు. స్టౌ మీద గిన్నె పెట్టి నీళ్లు పోసి, టీ పొడి వేసి బాగా మరిగించుకోవాలి. మరో గిన్నెలో పాలు పోసుకొని ఒక పొంగు వచ్చే వరకు వేడి చేసుకోవాలి. పాలను డికాక్షన్లో పోసుకోవాలి. చక్కెర వేసుకొని, రెండు నిమిషాలపాటు సన్నని మంటపై టీ మరగనివ్వాలి. టీని కప్పులోకి వడకట్టుకుంటే నాగౌరీ చాయ్ సిద్ధం!
ముసురుపట్టిన వేళ చిక్కటి టీ రుచి చూస్తూ, చక్కటి పుస్తకం ఆస్వాదిస్తూ గడపాలి.
– బిల్ వాటర్సన్, అమెరికన్ కార్టూనిస్ట్
Tea History | చైనాలో క్రీ.పూ. నుంచే తేయాకు పండినప్పటికీ జపాన్‌కు అస్సలు ఇవ్వలేదు.. చివరకు ఆ బౌద్ధ భిక్షువు పుణ్యమా అని చేరింది!Tea Tales | తేయాకు తోటలకు వెళ్లి మీరూ ఇలా మోసపోయారా?
Tea | కేరళలోని ఈ ఆలయంలో ఛాయ్‌నే తీర్థం.. పెసర గుడాలే ప్రసాదం !!
Tea History | అప్పట్లో తేయాకు కోసం ఆంగ్లేయులు, చైనా మధ్య పెద్ద యుద్ధమే జరిగింది!!
Tea | రైలు ప్రయాణంలో ఒక కప్పు ఛాయ్ తాగితే ఆ కిక్కే వేరు!