చెన్నై: ఆలయంలో నిర్వహించే దీపోత్సవంపై వివాదం తలెత్తింది. దర్గా సమీపంలోని పురాతన స్తంభంపై కార్తీక దీపం వెలిగించాలని హైకోర్టు న్యాయమూర్తి తీర్పు ఇచ్చారు. మత కలహాలకు దారి తీసేలా ఈ తీర్పు ఉండటంతో ఆయనను అభిశంసించాలని తమిళనాడులోని డీఎంకే ప్రభుత్వం భావిస్తున్నది. (DMK to impeach High Court judge ) తిరుపరంకుండ్రంలోని సుబ్రమణ్యస్వామి ఆలయంలో ఏటా డిసెంబర్లో కార్తీక దీపోత్సవం నిర్వహిస్తారు. ఆరవ శతాబ్దపు ఆలయం, 14వ శతాబ్దపు సికందర్ బాదుషా దర్గా ఉన్న కొండపై ఉన్న రెండు పురాతన స్తంభాల్లో ఒకదానిని ‘దీపథాన్’గా పిలుస్తారు.
కాగా, గత వందేళ్లుగా కొండ పాదాల వద్ద ఉన్న స్తంభంపై కార్తీక దీపం వెలిగిస్తున్నారు. అయితే కొండ పైభాగం కూడా ఆలయానికి చెందినదిగా పేర్కొంటూ నలుగురు వ్యక్తులు మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. కొండ పైభాగంపై ఉన్న రెండో స్తంభంపై కార్తీక దీపం వెలిగించేందుకు కోర్టు అనుమతి కోరారు.
మరోవైపు కొండ పైభాగంలో ఉన్న స్తంభం సమీపంలో దర్గా ఉండటంతో మత పరమైన ఘర్షణలు తలెత్తుత్తాయని డీఎంకే ప్రభుత్వం హైకోర్టులో వాదించింది. జస్టిస్ స్వామినాథన్ నేతృత్వంలోని డివిజన్ బెంచ్ 2017లో ఇచ్చిన ఆదేశాన్ని ప్రస్తావించింది. ఆలయ యాజమాన్యం కూడా పిటిషనర్ల డిమాండ్‌ను వ్యతిరేకించింది. దర్గా యాజమాన్యం కూడా తమ వాదనలు వినిపించింది.
మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జీఆర్ స్వామినాథన్, పిటిషనర్లకు మద్దతుగా డిసెంబర్ 1న తీర్పు ఇచ్చారు. డిసెంబర్ 4న సాయంత్రం 6 గంటలలోపు కొండపై ఉన్న పురాతన రాయిపై దీపం వెలిగించాలని సుబ్రమణ్య స్వామి ఆలయ అధికారులను ఆదేశించారు. అయితే ఆలయ అధికారులు దీనిని పాటించలేదు. ప్రభుత్వ సూచనకు అనుగుణంగా కొండ దిగువన ఉన్న స్తంభంపై దీపం వెలిగించారు.
కోర్టు తీర్పును పాటించకపోవడంపై హిందూ సంఘాలకు చెందిన వ్యక్తులు నిరసన తెలిపారు. కొండపై ఉన్న పురాతన స్తంభం వద్ద దీపం వెలిగించేందుకు ప్రయత్నించారు. భారీగా మోహరించిన పోలీసులు, భద్రతా సిబ్బంది వారిని చెదరగొట్టారు. ఈ పరిణామాల నేపథ్యంలో గురువారం తమిళనాడు ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీల్‌ను మద్రాస్ హైకోర్టుకు చెందిన ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం విచారించింది.
కాగా, కోర్టు తీర్పును ఉల్లంఘించడంపై మద్రాస్ హైకోర్టు ఆగ్రహించింది. డీఎంకే ప్రభుత్వం కోర్టు ధిక్కారానికి పాల్పడినట్లు ఆరోపించింది. ఈ నేపథ్యంలో డిసెంబర్ 5న రాష్ట్ర ప్రభుత్వం
సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపేందుకు సర్వోన్నత న్యాయస్థానం అంగీకరించింది. అయితే విచారణ తేదీని ఇంకా ఖరారు చేయలేదు.
మరోవైపు తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో మత ఘర్షణలు సృష్టించేందుకు బీజేపీ, అన్నాడీఎంకే ప్రయత్నిస్తున్నాయని సీఎం స్టాలిన్ ఆరోపించారు. ఈ పరిణామాల నేపథ్యంలో వివాదస్పద తీర్పు ఇచ్చిన మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జీఆర్ స్వామినాథన్‌ను అభిశంసించాలని డీఎంకే ప్రభుత్వం నిర్ణయించింది. అసెంబ్లీ సమావేశాల్లో ఈ మేరకు అభిశాంసన తీర్మానం ప్రవేశపెట్టనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
Also Read:
Watch: లైవ్ స్క్రీన్‌లో కనిపించేందుకు కొందరు ఎంపీల ఆరాటం.. సీట్లు మారిన వీడియో వైరల్
rabies infected cow dies | రేబిస్ సోకి ఆవు మృతి.. టీకా కోసం క్యూ కట్టిన గ్రామస్తులు