Karnataka | బెంగళూరు, జనవరి 3: కర్ణాటక కాంగ్రెస్‌లో మళ్లీ కుమ్ములాటలు ముదిరాయి. న్యూ ఇయర్ వేడుకల పేరుతో కాంగ్రెస్ నేతలు విందు రాజకీయాలకు తెరలేపారు. ఉప ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌కు చెక్ పెట్టే దిశగా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వర్గం వేగంగా పావులు కదుపుతున్నది. పార్టీలో, ప్రభుత్వంలో డీకే ప్రాభవాన్ని తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నది. డీకే శివకుమార్ విదేశాల్లో ఉండగా ఈ ప్రయత్నాలను ముమ్మరం చేసినట్టు కనిపిస్తున్నది. డీకే శివకుమార్‌ను పీసీసీ అధ్యక్షపీఠం నుంచి తప్పించడం, తనతో పాటు మరికొందరికీ ఉప ముఖ్యమంత్రి పదవులు ఇప్పించడం ద్వారా డీకేకు చెక్ పెట్టాలనేది సిద్ధరామయ్య వ్యూహమనే ప్రచారం జరుగుతున్నది.
మంత్రి సతీశ్ జార్కిహోళి నివాసంలో గురువారం రాత్రి విందు జరిగింది. ఏడుగురు మంత్రులతో పాటు 20 మంది వరకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఈ సమావేశానికి హాజరయ్యారు. సీఎం సిద్ధరామయ్య సైతం ఈ విందుకు హాజరయ్యారు. నూతన సంవత్సరం సందర్భంగానే ఈ విందు జరిగిందని, రాజకీయాలు చర్చించలేదని మంత్రి హెచ్‌సీ మహదేవప్ప చెప్పారు. ముడా కుంభకోణంలో సిద్ధరామయ్యపై విచారణ నేపథ్యంలో సీఎం పదవిని దక్కించుకునేందుకు డీకే శివకుమార్ ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో శివకుమార్‌కు చెక్ పెట్టే ప్రయత్నమే ఈ సమావేశమనే ప్రచారం జరుగుతున్నది.
కాంగ్రెస్ విందు రాజకీయాలపై బీజేపీ ఎంపీ, మాజీ సీఎం జగదీశ్ శెట్టర్ శుక్రవారం కీలక వ్యాఖ్యలు చేశారు. ‘సీఎంను తప్పించేందుకు డీకే.. డీకేను పదవి నుంచి తప్పించి, ఆయన స్థాయిని తగ్గించేందుకు సీఎం ప్రయత్నిస్తున్నారు. చివరకు ఈ గొడవ ప్రభుత్వ పతనానికి దారి తీస్తుంది’ అని అన్నారు. ‘మీరు మీడియాలో కనిపించడానికి పరిమితమా? పార్టీలో అసలు మీ ప్రభావం లేదా? పరిస్థితి ఇలాగే కొనసాగితే సీఎం అవ్వాలనే మీ కల కలగానే మిగిలిపోవడం గ్యారెంటీ’ అని డీకేను ఉద్దేశించి ప్రతిపక్ష నేత ఆర్ అశోక వ్యాఖ్యానించారు.