DK Shivakumar : కాంగ్రెస్ జన్ ఆందోళన యాత్రలో బీజేపీ, జేడీయూ నేతలే లక్ష్యంగా కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ విమర్శలు గుప్పించారు. హెచ్డీ కుమారస్వామి, బీఎస్ యడియూరప్స సహా విపక్ష నేతలు గతంలో చేసిన ప్రకటనల వీడియోను ప్రదర్శించారు. తాము రాజకీయ కోణంలోనే ఇలా చేస్తున్నామని కాషాయ నేతలు అనుకోవచ్చని కానీ అది వాస్తవం కాదన్నారు. వారు ఏం మాట్లాడారనేదే తాము చూపామని చెప్పారు. ప్రధాని మోదీ కేవలం అయిదు నిమిషాల్లోనే మేకేదాటు ప్రాజెక్టుకు అనుమతి ఇచ్చేలా చూస్తానని కుమారస్వామి చెప్పిన విషయాన్ని డీకే శివకుమార్ గుర్తుచేశారు.
కుమారస్వామి గురించి యడియూరప్ప ఏం మాట్లాడారు, బీజేపీ, ప్రధానమంత్రిని ఉద్దేశించి కుమారస్వామి ఏం మాట్లాడారనేది తాను చూపాలని అనుకున్నానని చెప్పారు. కాగా, కర్నాటకలో సిద్ధరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కార్ అవినీతికి పాల్పడుతున్నదని ఆరోపిస్తూ బీజేపీ-జేడీఎస్ చేపట్టిన ఛలో మైసూర్ పాదయాత్రపై కర్నాటక మంత్రి డాక్టర్ శరణ్ ప్రకాష్ పాటిల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వారు పాదయాత్ర చేయడం లేదని పశ్చాత్తాప యాత్ర చేస్తున్నారని వ్యాఖ్యానించారు.
పాటిల్ మంగళవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ కర్నాటకలో అవినీతిని ప్రారంభించిందే కాషాయ నేతలని దుయ్యబట్టారు. ఈ విషయంలో తాము ప్రజల్లో అవగాహన తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని అన్నారు. బీజేపీ నేతలు తాము చేసిన తప్పిదాలను కప్పిపుచ్చుకునేందుకే పాదయాత్ర పేరిట హంగామా చేస్తున్నారని మంత్రి డాక్టర్ శరణ్ ప్రకాష్ పాటిల్ ఆరోపించారు. అవినీతిలో నిండా మునిగిన కాషాయ నేతలు తాము అధికారం కోల్పోగానే ఇప్పుడు అవినీతి జరుగుతోందని గగ్గోలు పెడుతున్నారని మంత్రి బీజేపీ నేతలను ఎద్దేవా చేశారు.
Read More :
Mushrooms | మ్యాజిక్ మష్రూమ్లతో మానసిక అస్వస్థతలకు చికిత్స!