DK Shivakumar | చిక్కమగళూరు(కర్ణాటక) : ఐదేళ్లపాటు అధికారంలో ఉండేలా రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీని దీవించారని, పార్టీ అధిష్ఠానం ఆదేశాల ప్రకారం తాను, సీఎం సిద్ధరామయ్య నడుచుకుంటామని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ శనివారం ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీలో అధికారం కోసం కుమ్ములాటలు జరుగుతున్నాయంటూ వస్తున్న వార్తలను తోసిపుచ్చడానికి ఆయన ప్రయత్నించారు. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్న డీకే శివకుమార్ రాక సందర్భంగా ఇక్కడ పార్టీ కార్యకర్తలు కాబోయే ముఖ్యమంత్రి అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. తనకు ఎవరి మద్దతు అవసరం లేదని, పార్టీ నాయకత్వం ఆదేశాలకు కట్టుబడి ఉంటానని విలేకరులతో మాట్లాడుతూ ఆయన స్పష్టం చేశారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అధికార పార్టీ రాజకీయాల్లో మార్పు జరిగే ప్రసక్తి లేదని ఆయన తెలిపారు. సీఎం పోస్టు మార్పిడిపై బయట జరుగుతున్న ప్రచారానికి విలువ లేదని ఆయన వ్యాఖ్యానించారు.