లక్నో: ధనిక కుటుంబంలో దీపావళి పండుగ విషాదం నింపింది. (Diwali Tragedy) పండుగ నాడు పూజా గదిలో వెలిగించిన దీపాల నుంచి మంటలు చెలరేగాయి. ఆ ఇంటి అంతా వ్యాపించాయి. దీంతో నిద్రలో ఉన్న వ్యాపారవేత్త దంపతులతోపాటు పనిమనిషి సజీవ దహనమయ్యారు. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఈ సంఘటన జరిగింది. కాకాదేవ్ ప్రాంతానికి చెందిన 48 ఏళ్ల వ్యాపారవేత్త సంజయ్ శ్యామ్ దాసాని కుటుంబానికి అంబాజీ ఫుడ్స్, బిస్కెట్ల తయారీ పరిశ్రమలు వంటి వ్యాపారాలున్నాయి.
కాగా, పాండు నగర్‌లోని మూడు అంతస్తుల భవనంలో నివసించే సంజయ్ శ్యామ్ దాసాని, 42 ఏళ్ల భార్య కనికా గురువారం దీపావళి సందర్భంగా ఇంటిలోని పూజా మండపంలో దీపాలు వెలిగించి పూజలు నిర్వహించారు. రాత్రి భోజనం తర్వాత ఆ దంపతులు నిద్రించారు. అయితే పూజా గదిలోని వెలుగుతున్న దీపాల నుంచి మంటలు చెలరేగి ఇల్లంతా వ్యాపించాయి. దీంతో వ్యాపారవేత్త సంజయ్ శ్యామ్ దాసాని, ఆయన భార్య కనికా దాసానితో ఆ ఇంట్లో ఉన్న 24 ఏళ్ల పనిమనిషి సజీవ దహనమయ్యారు.
మరోవైపు స్నేహితులతో కలిసి దీపావళి వేడుక జరుపుకున్న కుమారుడు హర్ష్ దాసాని, అర్ధరాత్రి తర్వాత ఇంటికి తిరిగి వచ్చాడు. ఇంట్లో మంటలు, పొగలు గమనించి ఫైర్ కంట్రోల్‌కు సమాచారం ఇచ్చాడు. అక్కడకు చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. వ్యాపారవేత్త సంజయ్ శ్యామ్ దాసాని, ఆయన భార్య కనికా దాసానితోపాటు ఆ ఇంట్లో ఉన్న పనిమనిషి కూడా మంటల్లో కాలి మరణించినట్లు గుర్తించారు.
అయితే వ్యాపారవేత్త ఇంట్లో వుడ్ ఫర్నీచర్ ఎక్కువగా ఉండటంతో బెడ్రూమ్, బాల్కనీ ప్రాంతాలకు మంటలు వేగంగా వ్యాపించినట్లు అగ్నిమాపక అధికారులు తెలిపారు. ఆటోమేటిక్ డోర్ లాక్ పడటంతో లోపలున్న వారు బయటకు రాలేక మంటల్లో చిక్కుకుని సజీవ దహనమైనట్లు అనుమానం వ్యక్తం చేశారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఫోరెన్సిక్ బృందాన్ని రప్పించి ఆధారాలు సేకరించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.