(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్(నమస్తే తెలంగాణ): వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికల్లో లబ్ధిపొందటమే లక్ష్యంగా బీజేపీ కొత్త కుట్రలకు తెరతీస్తున్నది. పీఎం ఆవాస్ యోజన ప్రయోజనాలను లక్షిత రాష్ర్టాలకు తరలిస్తున్నది. ఈ మేరకు జాతీయ పత్రిక ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’లో ప్రచురితమైన కథనం చర్చనీయాంశంగా మారింది. పేద, మధ్యతరగతి ప్రజలకు సొంతిళ్లు కట్టిస్తామంటూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 2015-16లో ‘పీఎం ఆవాస్ యోజన-గ్రామీణ’ పేరిట ఓ పథకాన్ని ప్రారంభించింది. 2022నాటికి 2.95 కోట్ల ఇండ్లను నిర్మించాలన్నది లక్ష్యం. పనులు నత్తనడకన సాగుతుండటంతో డెడ్‌లైన్‌ను మార్చి, 2024కు పొడిగించారు. కాగా, లక్షిత సమయానికి ప్రజలకు ఇండ్లను కేటాయించడంలో 23 రాష్ర్టాలు, యూటీలు విఫలమయ్యాయంటూ ఈ ప్రాజెక్టును నిర్వహిస్తున్న గ్రామీణాభివృద్ధిశాఖ తాజాగా తెలిపింది. దీంతో ఆవాస్ యోజన కింద ఈ రాష్ర్టాలకు కేటాయించిన 1.44 లక్షల ఇండ్లను ఉత్తరప్రదేశ్‌కు మళ్లిస్తున్నట్టు వెల్లడించింది. కేంద్రం మొండిచేయి ఇచ్చిన రాష్ర్టాల జాబితాలో ఆంధ్రప్రదేశ్, ఉత్తరాఖండ్, హర్యానా, పంజాబ్, జార్ఖండ్, కేరళ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, పశ్చిమబెంగాల్, బీహార్, అరుణాచల్‌ప్రదేశ్, తమిళనాడు, మిజోరం, నాగాలాండ్, అస్సాం, మహారాష్ట్ర, మేఘాలయ, సిక్కిం, ఒడిశా, త్రిపుర, గుజరాత్, అండమాన్ అండ్ నికోబార్, లఢక్ ఉన్నాయి.
యూపీకే ఎందుకు?
పీఎం-ఆవాస్ యోజన (గ్రామీణ) పథకంలో భాగంగా 2.95 కోట్ల ఇండ్లను నిర్మించడాన్ని లక్ష్యంగా పెట్టుకొన్నప్పటికీ, ఇప్పటికీ ఈ పథకం నత్తనడకన సాగుతున్నట్టు క్షేత్రస్థాయి పరిశీలన ద్వారా తెలుస్తున్నది. 2.1 కోట్ల ఇండ్లను నిర్మించినట్టు ప్రభుత్వం చెబుతున్నది. అయితే వాస్తవ పరిస్థితులు భిన్నంగా ఉన్నట్టు సమాచారం. కాగా లబ్ధిదారుల ఎంపిక, ఇండ్ల కేటాయింపుల్లో యూపీ ప్రభుత్వం జాప్యం చేస్తున్నట్టు ఆవాస్ యోజన వెబ్‌సైట్‌లోని గణాంకాలను బట్టి తెలుస్తున్నది. 34,78,718 ఇండ్లను నిర్మించాలంటూ యూపీకి కేంద్రం టార్గెట్ నిర్ణయించింది. 26,49,795 ఇండ్లను లబ్ధిదారులకు కేటాయించగా, ఇందులో 25,95,313 ఇండ్లు నిర్మించింది. ఇంకా దాదాపు 10 లక్షల ఇండ్ల ప్రక్రియ పెండింగ్‌లో ఉన్నది. కాగా, వివిధ రాష్ర్టాలకు రావాల్సిన ఇండ్లను కూడా యూపీకి కట్టబెట్టింది. లోక్‌సభలో యూపీ ప్రాతినిథ్యం 80 స్థానాలు. దీంతో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే బీజేపీ సర్కారు పక్షపాత వైఖరిని ప్రదర్శించినట్టు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.