ఇంఫాల్: మణిపూర్ బీజేపీలో అసమ్మతి మొదలైంది. బీరేన్‌సింగ్ ప్రభుత్వ తీరుపై సొంత పార్టీకే చెందిన పలువురు ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తున్నది. ఈ మేరకు బీజేపీ అధిష్ఠానానికి ఫిర్యాదు చేయడానికి వారు ఢిల్లీలో మకాం వేశారు. అసంతృప్తితో ఉన్న ఎమ్మెల్యేల్లో రాధేశ్యామ్‌సింగ్, కరమ్ శ్యామ్, పవోనమ్ బ్రోజెన్, రఘురామితో పాటు మరికొందరు ఉన్నట్టు సమాచారం.
మణిపూర్ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పదవికి ఎమ్మెల్యే కరమ్ శ్యామ్ రాజీనామా చేశారు. తనకు ఎలాంటి బాధ్యతలు అప్పగించకపోవడమే తన రాజీనామాకు కారణమని ఆయన ప్రకటించారు. ఇదే కారణంతో మరో అసంతృప్త ఎమ్మెల్యే రాధేశ్యామ్‌సింగ్ సీఎం సలహాదారు పదవికి పది రోజుల కింద రాజీనామా చేశారు. వీరంతా ముఖ్యమంత్రి బీరేన్‌సింగ్‌కు వ్యతిరేకంగా పావులు కదుపుతున్నట్టు తెలుస్తున్నది. ముందుగా బీజేపీ పెద్దలకు ఫిర్యాదు చేయాలని అసంతృప్త ఎమ్మెల్యేలు భావిస్తున్నారు.
కుకి తెగ ఎమ్మెల్యేల అసంతృప్తి
కుకి తెగకు చెందిన ఎమ్మెల్యేలు ప్రధానంగా బీజేపీ ప్రభుత్వ వైఖరిపై అసంతృప్తితో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. మణిపూర్‌లో బలమైన ఈ తెగకు చెందిన వారు పది మంది ఎమ్మెల్యేలుగా ఉండగా అందులో ఏడుగురు బీజేపీ సభ్యులు. రిజర్వ్డ్ ఫారెస్టు ప్రాంతం నుంచి కుకి తెగకు చెందిన ప్రజలను బయటకు పంపడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల పట్ల ఆ తెగ ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉన్నారు. ఢిల్లీలో క్యాంపు వేసిన వారిలో కుకి తెగ ఎమ్మెల్యేలు ఉన్నట్టు తెలుస్తున్నది.