న్యూఢిల్లీ: ఆహారం, జీవన శైలి మార్పులకు; ఊబకాయం, మధుమేహం, గుండె సంబంధిత వ్యాధుల భారం పెరుగుతుండటానికి మధ్య సంబంధం ఉందని దేశవ్యాప్తంగా జరిగిన తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఇండియా డయాబెటిస్ పేరుతో భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) దీన్ని నిర్వహించింది. ‘నేచర్ మెడిసిన్’లో ప్రచురితమైన ఈ నివేదిక ప్రకారం, దేశంలోని వయోజనుల్లో 83 శాతం మంది ఏదో ఒక మెటబాలిక్ రిస్క్‌తో బాధ పడుతున్నారు. హైపర్ టెన్షన్, హై కొలెస్టరాల్, లావు పెరగడం, డయాబెటిస్ ఇప్పుడు దేశవ్యాప్తంగా సాధారణ విషయంగా మారింది. 18,090 మంది వయోజనులు ఈ అధ్యయనంలో పాల్గొన్నారు. వీరి సగటు వయసు 40 ఏండ్ల్లు. వీరిలో మూడింట ఒక వంతు మందికి తీవ్రమైన అధిక రక్తపోటు (హైపర్‌టెన్షన్) ఉంది. 9 శాతం మందికి టైప్ 2 మధుమేహం ఉంది. ప్రీ డయాబెటిస్ 41 శాతం మందికి ఉంది. ఊబకాయం పెరుగుదల కూడా ఆందోళనకరంగానే ఉంది.
పట్టణాల్లో తక్కువ శారీరక కార్యకలాపాల్లో ఎక్కువ సమయం గడపటం, ఆహారపు అలవాట్ల వల్ల ఈ ముప్పు తీవ్రంగా కనిపిస్తున్నది. గ్రామీణులతో పోల్చినపుడు, పట్టణవాసులు ధూమపానం, మద్యపానం చేయడం తక్కువగా ఉంది. కానీ తక్కువ పని చేస్తూ, అధిక బరువుతో, ఊబకాయంతో, లేదా హైపర్ టెన్షన్‌తో పట్టణ వాసులు బాధ పడుతున్నారు.
మన ఆహారంలో వరి అన్నం, గోధుమలు, పంచదార వంటి తక్కువ నాణ్యత గల కార్బొహైడ్రేట్లు అధికంగా ఉంటున్నాయని గమనించింది. ప్రజల్లో ప్రొటీన్ల కొరత విపరీతంగా ఉంటున్నది. ఈ అసమతుల్యత ప్రభావం తీవ్రంగా కనిపిస్తున్నది. ఎక్కువ కార్బొహైడ్రేట్లను తీసుకున్నవారు వాటిని తక్కువగా తినేవారి కన్నా ఎక్కువ ఆరోగ్య సమస్యలతో బాధపడే అవకాశం ఉంటుందని ఈ అధ్యయనం వెల్లడించింది. తెల్లగా రిఫైన్ చేసిన వరి అన్నానికి బదులుగా గోధుమలు లేదా చిరు ధాన్యాల పిండిని తినడం వల్ల మధుమేహం లేదా ఊబకాయం ముప్పు తగ్గదు.
కార్బొహైడ్రేట్లకు బదులుగా ప్రొటీన్లను తినడం వల్ల ఫలితాలు మెరుగ్గా కనిపించాయి. మొక్కలు, పాడి పరిశ్రమ, గుడ్లు, లేదా, చేపల ద్వారా లభించే ప్రొటీన్లను తినడం వల్ల టైప్ 2 మధుమేహం వచ్చే ముప్పు 9-11 శాతం తగ్గింది. ప్రీ డయాబెటిస్ ముప్పు 6-18 శాతం తగ్గింది. ప్రీ డయాబెటిస్‌ను నిరోధించడంలో డెయిరీ ప్రొటీన్ మంచి ఫలితాలను చూపించింది. ఎగ్ ప్రొటీన్ డయాబెటిస్‌కు వ్యతిరేకంగా బాగా పని చేసింది.
మొత్తం మీద కార్బొహైడ్రేట్లు, శాచురేటెడ్ కొవ్వులను తగ్గించడంపై ప్రజారోగ్య వ్యూహాలు దృష్టి పెట్టాలి. పాల ఉత్పత్తులు, కోడి గుడ్లు, చేపలు, ప్లాంట్ ప్రొటీన్స్ వంటి ప్రొటీన్లు ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తినాలని ప్రజలను ప్రోత్సహించాలి. మొక్కలు, చేపల ప్రొటీన్స్‌ను తీసుకుంటూ ఓవరాల్ కేలరీలు పెరగకుండా చూసుకుంటే, డయాబెటిస్, ప్రీడయాబెటిస్ రిస్క్ చెప్పుకోదగ్గ స్థాయిలో తగ్గుతుంది.