న్యూఢిల్లీ, జూలై 23: ప్రతిపక్ష ఎంపీల నిరసనలు, రభస కొనసాగడంతో వరుసగా మూడో రోజు బుధవారం కూడా పార్లమెంట్ వర్షాకాల సమావేశాలలో గందరగోళం పరిస్థితులు నెలకొన్నాయి. సభా కార్యకలాపాలకు తీవ్ర అవరోధం ఏర్పడడంతో రాజ్యసభ, లోక్‌సభ గురువారానికి వాయిదా పడ్డాయి. ఆపరేషన్ సిందూర్‌పై జూలై 28 నుంచి పార్లమెంట్ ఉభయ సభలలో ప్రత్యేక చర్చ జరపడానికి ప్రభుత్వం అంగీకరించినట్లు తెలుస్తున్నది. 16 గంటల చొప్పున ఉభయ సభలకు సమయం కేటాయించింది. మందుగా సోమవారం లోక్‌సభలో, మరుసటి రోజు మంగళవారం రాజ్యసభలో చర్చ చేపట్టనున్నట్లు సమాచారం.
విపక్షాల ప్రధాన డిమాండ్లు
బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికల ముందు ఎన్నికల కమిషన్ ఓటర్ల జాబితాకు ప్రత్యేక నిశిత సవరణ(సర్) చేపట్టడం, పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్, భారత్, పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందానికి తానే మధ్యవర్తిత్వం వహించానంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదేపదే ప్రకటించడం వంటి అంశాలపై వెంటనే చర్చను చేపట్టాలన్న డిమాండుపై విపక్ష సభ్యులు పట్టు వీడకపోవడంతో ఉభయ సభలలో రభస కొనసాగింది. గోవా రాష్ర్టానికి చెందిన అసెంబ్లీ నియోజకవర్గాలలో షెడ్యూల్డు తెగల ప్రాతినిధ్యాన్ని సవరించడానికి సంబంధించిన బిల్లుపై చర్చించాలని స్పీకర్ తెన్నేటి కృష్ణ ప్రసాద్ పదేపదే అభ్యర్థించినప్పటికీ విపక్ష సభ్యులు వినిపించుకోకపోవడంతో లోక్‌సభను గురువారానికి వాయిదా వేశారు.