Dimple Yadav : యూపీ అసెంబ్లీలో విపక్ష నేత పదవిపై సీఎం యోగి ఆదిత్యానాథ్ చేసిన వ్యాఖ్యలపై ఎస్పీ ఎంపీ డింపుల్ యాదవ్ స్పందించారు. యూపీ ప్రభుత్వం అనవసర విషయాలను పక్కనపెట్టి ప్రజల సమస్యలు తీర్చడంపై దృష్టి సారిస్తే మేలని ఆమె హితవు పలికారు. యూపీలోని పూర్వాంచల్ ప్రాంతం వరదలతో తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నదని చెప్పారు. ఆ ప్రాంతంలో విద్యుత్ సంక్షోభం నెలకొందని, పలు గ్రామాల్లో వారాల తరబడి విద్యుత్ కోతలు కొనసాగుతున్నాయని డింపుల్ యాదవ్ ఆందోళన వ్యక్తం చేశారు.
సీఎం పదవిలో ఉన్న యోగి ఆదిత్యానాథ్ తన పనిపై దృష్టిసారించాల్సి ఉందని అన్నారు. యువతకు ఉపాధి కల్పించడంపై శ్రద్ధ వహించాలని ఇది యూపీతో పాటు దేశానికి మేలు చేస్తుందని తాను భావిస్తున్నానని డింపుల్ యాదవ్ పేర్కొన్నారు. మరోవైపు రాష్ట్ర ప్రజలు నిత్యావసరాల ధరలు పెరిగి ఇబ్బందులు పడుతున్నారని, పెరిగిన ధరలతో ఏమీ కొనుగోలు చేయలేని పరిస్ధితి నెలకొందని చెప్పారు. ఇక యూపీలో విపక్ష నేతగా అఖిలేష్ యాదవ్ స్ధానంలో మాతా ప్రసాద్ పాండే విపక్ష నేతగా ఎన్నికయ్యారు.
అఖిలేష్ స్ధానంలో విపక్ష నేత పదవి కోసం సీనియర్ నేతలు శివపాల్ సింగ్ యాదవ్, మాతా ప్రసాద్ పాండే, ఇంద్రజిత్ సరోజ్, రామ్ అచల్ రాజ్‌భర్, రవిదాస్ మల్హోత్రా రేసులో నిలిచినా పాండే వైపు అఖిలేష్ యాదవ్ మొగ్గుచూపారు. కర్హల్ స్ధానానికి ప్రాతినిధ్యం వహిస్తున్న అఖిలేష్ యాదవ్ కన్నౌజ్ నుంచి లోక్‌సభకు ఎన్నికవడంతో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఇక లోక్‌సభ ఎన్నికల్లో యూపీలోని 80 లోక్‌సభ స్ధానాలకు గాను విపక్ష ఇండియా కూటమి 43 స్దానాల్లో విజయం సాధించిన సంగతి తెలిసిందే.
Read More :
MLA Padi Kaushik Reddy | సోం డిస్టిలరీ నుంచి కాంగ్రెస్‌కు 1.8 కోట్లు : ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి