న్యూఢిల్లీ, అక్టోబర్ 8: అమెరికాలో స్థిరపడిన ప్రవాస భారతీయులంటే (NRI) భారతీయ వివాహ మార్కెట్లో ఒకప్పుడు తిరుగులేని డిమాండ్ ఉండేది. ఆర్థిక భద్రత, మెరుగైన జీవన ప్రమాణాలకు హామీగా భావించే ఈ సంబంధాల పట్ల ఇప్పుడు కుటుంబాలు వెనుకంజ వేస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ప్రభుత్వం తీసుకొచ్చిన కఠినమైన ఇమిగ్రేషన్ (Immigration) విధానాలు, ముఖ్యంగా హెచ్-1బీ వీసాపై ఆంక్షలు ఈ మార్పును తీసుకొచ్చాయి. హర్యానాకు చెందిన 19 ఏళ్ల మెడికల్ స్టూడెంట్ సిద్ధిశర్మ అమెరికాలో ఉద్యోగం చేస్తున్న భారతీయ పౌరుడిని పెళ్లి చేసుకోవాలని కలలు కనేది. అయితే, ట్రంప్ ఇమిగ్రేషన్ నిబంధనలు ఆమె ఆశలపై నీళ్లు చల్లాయి.
‘అమెరికాలో స్థిరపడాలని కలలు కన్నాను. ట్రంప్ నా తలుపులు మూసేశారు’ అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అమెరికా ఇమిగ్రేషన్ విధానాలు కఠినతరం కావడం, ముఖ్యంగా హెచ్-1బీ స్కిల్డ్ వర్కర్ వీసాలపై ఆంక్షలు పెరగడంతో అమెరికా సంబంధాలపై భారతీయులలో మోజు తగ్గిపోయింది. తమ పిల్లలకు కాబోయే జీవిత భాగస్వామికి అమెరికాలో ఉద్యోగం లేదా ఇమిగ్రేషన్ హోదా ఎక్కడ పోతుందోనన్న భయం భారతీయ కుటుంబాలలోని తల్లిదండ్రులను వెంటాడుతోంది. గతంలో మాదిరిగా అమెరికా సంబంధాలపై భారతీయ కుటుంబాలలో వెంపర్లాట తగ్గిపోయిందని పెళ్లి సంబంధాలు కుదిర్చే సంస్థలు, విద్యావేత్తలు, పెళ్లీడు పిల్లలు తెలిపారు.
తగ్గిన డిమాండ్
సాధారణంగా మన దేశంలో అధిక శాతం వివాహాలు పెద్దలు కుదిర్చిన అరేంజ్డ్ మ్యారేజ్‌లే ఉంటాయి. ఇప్పుడిప్పుడే నగరాలలో ప్రేమ వివాహాలు పెరుగుతున్నప్పటికీ వాటికి కూడా పెద్దల మద్దతు క్రమంగా పెరుగుతోంది. ఇతర దేశాలతో పోలిస్తే అమెరికాలో భారతీయ సంతతికి చెందినవారు, భారత జాతీయులే అత్యధికంగా నివసిస్తున్నారు. భారత ప్రభుత్వ లెక్కల ప్రకారం 21 లక్షల మంది ప్రవాస భారతీయులు(ఎన్ఆర్ఐ) అమెరికాలో నివసిస్తున్నారు. వీరిలో పెళ్లీడు పిల్లల కోసం భారతదేశం నుంచి వేట జరుగుతుంటుంది. ఈ ఏడాది జనవరిలో ట్రంప్ మళ్లీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇమిగ్రేషన్ నిబంధనలు కఠినతరం చేయడంతో హెచ్-1బీ వర్క్ వీసాలపై చాలామంది ఆశలు వదులుకున్నారు.
అమెరికాలో స్థిరపడిన వ్యక్తిని పెళ్లి చేసుకుంటే ఆర్థిక భద్రత, మెరుగైన జీవితం లభిస్తుందని భారతీయ కుటుంబాలు ఆశిస్తుంటాయి. గత ఏడాది వరకు ఎన్ఆర్ఐ సంబంధాలపై మోజు ఎక్కువగా ఉండేదని వనజారావు క్విక్ మ్యారేజెస్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వనజా రావు తెలిపారు. ఈ ఏడాది జనవరి నుంచి అమెరికా సంబంధాల కోసం ఆరా తీసేవారి సంఖ్య క్రమంగా తగ్గిపోవడం మొదలైందని, గత ఆరు నెలల్లో అది మరింత తగ్గిపోయిందని ఆమె తెలిపారు. కొందరైతే పెళ్లి ముహూర్తాలను వాయిదా వేస్తున్నారని ఆమె చెప్పారు.
వివాహాలు వాయిదా..
ఇమిగ్రేషన్‌కు సంబంధించి చాలా అస్థిరత ఏర్పడిందని అట్లాంటాలో నివసించే ఓ 26 ఏళ్ల బారతీయ విద్యార్థి తెలిపారు. ట్రంప్ ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త ఆంక్షల కారణంగా తనకు తెలిసి మూడు వివాహాలు వాయిదాపడినట్లు ఆయన చెప్పారు. హెచ్-1బీ వీసాలు, స్కిల్డ్ వర్కర్ ఇమిగ్రేషన్‌కు సంబంధించి ఆంక్షలు కఠినతరం కానున్నట్లు వార్తలు వచ్చిన ప్రతిసారి వివాహ మార్కెట్‌పై దాని ప్రతికూల ప్రభావం ఉంటోందని టొరంటో మెట్రోపాలిటన్ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న మర్షిత యలమర్తి తెలిపారు. ట్రంప్ కొత్త నిబంధనలను పురస్కరించుకుని అనేక మ్యాచ్ మేకింగ్ సర్వీసులు తమ పద్ధతులను మార్చుకుంటున్నాయి.
కేనాట్.డేటింగ్ అనే వివాహపరిచయ వేదిక వధూవరుల వీసా స్థితిని తన యాప్‌లో పొందుపరిచే కొత్త విధానాన్ని ప్రారంభించింది. ఎన్ఆర్ఐ సంబంధాలపై చాలా మంది ఆసక్తి కనబరుస్తున్నారని, అయితే వీసా హోదా ఏమిటో ముందుగానే ఆరా తీసి మరీ సంబంధం మాట్లాడుతున్నారని ఆ కంపెనీ సహవ్యవస్థాపకుడు, సీఈఓ జస్వీర్ సింగ్ చెప్పారు. సెప్టెంబర్‌లో తమ యాప్‌లో ఈ ఫీచర్‌ని ప్రారంభించిన తర్వాత దాదాపు 1,000 మంది ఎన్ఆర్ఐలు రిజిస్టర్ అయ్యారని చెప్పారు.
ఇతర దేశాలవైపు చూపు
అమెరికా కల కరిగిపోతుండడంతో ఇప్పుడిప్పుడే కెనడా, బ్రిటన్, యూరపు, పశ్చిమాసియా సంబంధాలపై ఆరా మొదలైందని వెడ్డింగ్ టేల్స్ మ్యాట్రిమోని వ్యవస్థాపకురాలు నికితా ఆనంద్ వెల్లడించారు. తమ పిల్లలకు పెళ్లి చేయాలన్న నిర్ణయం తీసుకున్న తల్లిదండ్రులు ముందుగా ప్రయాణ సౌకర్యాలు, భద్రత గురించి ప్రధానంగా ఆలోచిస్తారని, తమ పిల్లల దీర్ఘకాలిక స్థిరత్వమే కాకుండా భవిష్యత్ తరాల భరోసా గురించి ఆలోచిస్తారని అనురాధ గుప్తా అభిప్రాయపడ్డారు.