న్యూఢిల్లీ, జూలై 17 : 2025-26 విద్యా సంవత్సరం నుంచి 10, 12వ తరగతుల బోర్డు పరీక్షలను ఏడాదికి రెండుసార్లు నిర్వహించే విషయంలో సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ) డైలమాలో ఉన్నట్టు కనిపిస్తున్నది. ఈ అంశంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోతున్నది. మరోవైపు సెమిస్టర్ విధానంలో పరీక్ష నిర్వహణ ఆప్షన్ కూడా సీబీఎస్ఈ ముందున్నది. దీనిపై విస్తృత సంప్రదింపులు జరుగుతున్నాయని, ఏడాదికి రెండుసార్లు బోర్డు పరీక్షలను ఎప్పుడు, ఏ విధానంలో నిర్వహించాలనే దానిపై ఇంకా ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదని అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. ప్రసుత్తం 10, 12 తరగతుల బోర్డు పరీక్షలను ఫిబ్రవరి-మార్చిలో నిర్వహిస్తున్నారు. కాగా, బోర్డు పరీక్షలను ఏడాదికి రెండు సార్లు నిర్వహించాలని కొత్త జాతీయ కరిక్యూలమ్ ఫ్రేమ్‌వర్క్(ఎన్సీఎఫ్) సిఫారసుల్లో ఉన్నది. రెండు సార్లు పరీక్షలను ఎప్పుడు నిర్వహించాలనే దానిపై సీబీఎస్ఈ ముందు జనవరి-ఫిబ్రవరి, మార్చి-ఏప్రిల్, జూన్ ఆప్షన్లు ఉన్నాయి. విద్యా సంవత్సరం రూపకల్పన విధానం, పోటీ పరీక్షల షెడ్యూల్, సీబీఎస్ఈ పాఠశాలలు దేశంతోపాటు విదేశాల్లోనూ ఉండటం దృష్ట్యా సెమిస్టర్ విధానం అంతగా ఆచరణీయమైనదిగా కనిపించడం లేదని అధికారి ఒకరు పేర్కొన్నారు.
ప్రస్తుతం ఉన్న పరీక్షా విధానంలో 10, 12వ తరగతి బోర్డు పరీక్షల నిర్వహణకు 150కి పైగా స్టెప్లు అవసరం అవుతాయని సీబీఎస్ఈ కేంద్ర విద్యా శాఖకు వెల్లడించింది. విద్యార్థుల జాబితా నుంచి సెంటర్ నోటిఫికేషన్లు, రోల్ నంబర్ల విడుదల, ప్రాక్టికల్స్ నిర్వహణ, థియరీ పరీక్షలు, ఫలితాల ప్రకటన, వెరిఫికేషన్, రీవాల్యూయేషన్ వంటి మొత్తం ప్రక్రియ కనీసంగా 310 రోజులు సాగుతుందని, రెండు పరీక్షలు నిర్వహించాలంటే కనీసం 55 రోజుల సమయం పడుతుందని తెలిపింది. ఈ నేపథ్యంలో రెండో రౌండ్ పరీక్షలకు ఇంతటి భారీ కసరత్తును ఎప్పుడు, ఎలా చేయాలనేది ప్రస్తుతం సీబీఎస్ఈకి సవాల్‌గా మారింది. ఫిబ్రవరి కంటే ముందు పరీక్షలు నిర్వహించడం కష్టమని, కొన్ని రాష్ర్టాల్లో అప్పుడు విపరీతమైన మంచు కాలం ఉంటుందని అధికారి ఒకరు పేర్కొన్నారు.