ముంబై: మహారాష్ట్ర(Maharashtra Assembly Elections)లో ఎన్నికల సంఘం అధికారులు ఓ కారులో ఉన్న విలువైన ఆభరణాలను సీజ్ చేశారు. ఆ కారులో వజ్రాలు, బంగారం, వెండి, ఆభరణాలు ఉన్నట్లు గుర్తించారు. వాటి విలువ సుమారు 24 కోట్లు ఉంటుందన్నారు. అహల్యానగర్ జిల్లాలో ఉన్న ఓ టోల్‌బూత్ వద్ద ఎన్నికల సంఘానికి చెందిన స్టాటిక్ సర్వియలెన్స్ బృందం కారులో సోదాలు చేపట్టింది. ఆ కారులో ఉన్న సుమారు 24 కోట్ల ఖరీదైన ఆభరణాలను ఈసీ బృందం సీజ్ చేసింది. సుపా టోల్‌ప్లాజా వద్ద గురువారం ఉదయం ఈ ఘటన జరిగింది. నవంబర్ 20వ తేదీన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఎస్ఎస్టీ పోలీసుల్ని మోహరించారు.
ఆ కారులో ముగ్గురు ప్రయాణిస్తున్నారు. వజ్రాలు, బంగారం, సిల్వర్ జ్వలరీకి చెందిన కన్సైన్మెంట్ ఉన్నట్లు పోలీసులు చెప్పారు. దక్షిణ ముంబైలోని జావేరి బజార్ నుంచి ఆ వాహనం స్టార్ట్ అయినట్లు సుపా పోలీసు అధికారి అరుణ్ అవద్ తెలిపారు. ఆభరణాలకు చెందిన రశీదు చూపించాలని కోరగా, కొన్ని రశీదులను చూపించారని, కానీ ఆ రశీదుల్లో ఉన్న అమౌంట్లో తేడా ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. స్వాధీనం చేసుకున్న ఆభరణాల గురించి ఆదాయపన్ను శాఖకు ఎస్ఎస్టీ పోలీసులు సమాచారం చేరవేశారు. ఛత్రపతి సాంబాజినగర్, అహల్యనగర్, జల్గావ్ జిల్లాల్లో ఆ ఆభరణాలను డెలివరీ చేయాల్సి ఉందన్నారు.
దక్షిణ ముంబైలోని ఓ వాహనం నుంచి సుమారు 11 కోట్ల విలువైన విదేశీ కరెన్సీని ఎస్ఎస్టీ పోలీసులు సీజ్ చేశారు.