BC Dharna | జన గణనలో కులగణన చేపట్టాలని, పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టి చట్టసభలలో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు పెట్టాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ పెట్టాలని, బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు, ప్రైవేటు రంగంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్లు పెట్టాలన్నారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్వర్యంలో డిల్లీలోని పార్లమెంట్ వద్ద భారీ ప్రదర్శన జరిపారు. ఈ భారీ ప్రదర్శనకు జాతీయ బీసీ యువజన సంఘం అధ్యక్షులు గువ్వల భరత్ కుమార్, జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు గుజ్జ సత్యం అధ్యక్షత వహించారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ సమన్వయం చేశారు. వందలాది మంది సర్పంచులు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, బీసీ సంఘాల నాయకులు పెద్ద ఎత్తున పార్లమెంట్ కు రావడంతో జంతర్ మంతర్ దద్దరిల్లిపోయింది. `ఓట్లు బీసీలవి – సీట్లు అగ్రకులాలకా! జనాభా ప్రకారం వాటా పంచాలి` అంటూ ధర్నాకు హాజరైన ఆందోళనకారులు నినాదాలు చేశారు.
రాజ్యాధికారంలో వాటా పంచకుండా బీసీలకు ఎన్ని రోజులు అన్యాయం చేస్తారని ఆర్ కృష్ణయ్య ప్రశ్నించారు. ధర్నానుద్దేశించి ఆర్.కృష్ణయ్య ప్రసంగిస్తూ అన్ని రంగాలలో అభివృద్ధి చెందిన అగ్రకులాలకు ఒకే రోజులో బిల్లు పెట్టి ఆఘమేఘాల మీద 10 శాతం రిజర్వేషన్లు కల్పించిన కేంద్ర ప్రభుత్వం..బీసీలకు చట్ట సభలలో రిజర్వేషన్లు పెట్టాలని 30ఏళ్లుగా పోరాడుతున్నా పట్టించు కోవడంలేదని విమర్శించారు. బీసీలకు రాజ్యాధికారంలో వాటా ఇవ్వకుండా గొర్రెలు, గేదెలు, పందులు, పెన్షన్లతో ఓట్లు వేయించుకొని బీసీలను శాశ్వత బిచ్చగాళ్ళను చేస్తున్నారని విమర్శించారు.
చివరకు కులగణన చేసి బీసీల జనాభా కూడా లెక్కించడానికి అగ్రకుల పాలకులకు మనసు రావడం లేదని కృష్ణయ్య ఆరోపించారు.. లెక్కలు తీస్తే రిజర్వేషన్లు పెంచవలసి వస్తుందని భయపడుతున్నారని న్నారు. బీసీలకు కేంద్రస్థాయిలో ఒక్క స్కీమ్ కూడా లేదని, కాలేజీ కోర్సుల్లో చదివే విద్యార్థులకు ఫీజులు కూడా మంజూరు చేయడం లేదన్నారు. భారతదేశం అగ్ర దేశంగా తయారవుతుందని గొప్పలు చెప్పుకుంటున్న నేతలు చదువుకునే పేదలు తమపిల్లలకు ఫీజులు కూడా కట్టే స్థితిలో లేదన్నారు. రాజ్యాంగ రచన సమయంలోనే బీసీలకు విద్య, ఉద్యోగ, రాజకీయ, సామాజిక రంగాల్లో రిజర్వేషన్లు పెడితే ఎంతో ప్రగతి జరిగేదన్నారు.
మనదేశంలో 56 శాతం జనాభా కలిగిన బీసీలకు ఇంతవరకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించకుండా ఈ కులాలను అణచివేశారని ఆర్ కృష్ణయ్య ఆరోపించారు. రాజకీయ రంగంలో బీసీలకు ప్రాతినిథ్యం 14 శాతం దాటలేదంటే బి.సి లకు ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎంత అన్యాయం జరిగిందో తెలుస్తుందన్నారు. అలాగే ప్రస్తుత లోక్ సభలో 545 లోక్ సభ సభ్యులలో బీసలు కేవలం 96 మందేనన్నారు.
తెలంగాణ లో 119 మంది ఎమ్మెల్యేలకు 22 మంది మాత్రమే బీసీలని, 33 జిల్లాలకు 18 జిల్లాల నుంచి అసెంబ్లీకి ఒక్క బీసీ ఎమ్మెల్యే కూడా ప్రాతినిధ్యం వహించడం లేదని ఆర్ కృష్ణయ్య ఆందోళన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 175 మంది ఎమ్మెల్యేలు ఉండగా బీసీ 40 మంది దాటడం లేదన్నారు.
కేంద్రంలో బీసీలకు పోస్ట్ మెట్రిక్స్ స్కాలర్ షిప్, ఫీజు రియంబర్స్మెంట్ స్కీము విధానం సాచురేషన్ పద్ధతిలో ప్రవేశపెట్టాలన్నారు. రాష్ట్రాలకు 80 మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వాలని, కేంద్ర ప్రభుత్వ శాఖలలో, ప్రభుత్వ రంగ సంస్థలలో ఖాళీగా ఉన్న 16 లక్షల ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయాలని కోరారు.కేంధ్ర స్థాయిలో 2 లక్షల కోట్ల బడ్జెట్ బి.సి సబ్ ప్లాన్ ఏర్పాటు చేయాలని కోరారు.